Posani Krishna Murali: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయా? 9 నెలలు సైలెంట్‌గా ఉన్న కూటమి సర్కార్, ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలపై ఫోకస్ చేసిందా? ఎప్పుడు ఎవర్ని అరెస్ట్ చేస్తారో వైసీపీ నేతలు బెంబేలెత్తుతున్నారా? గతరాత్రి హైదరాబాద్‌లో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తర్వాత రేసులో మరో ఇద్దరు నేతలున్నట్లు టీడీపీ వర్గాలు మాట. ఇంతకీ ఆ నేతలెవరు? అనేదానిపై ఓ లుక్కేద్దాం.
అసలేం జరిగింది?
రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆచితూచి అడుగులు వేయాలి. అధికారం ఉందని ఇష్టానుసారంగా రెచ్చిపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి లాంటి వైసీపీ నేతలే ఉదాహరణ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ-జనసేన అగ్రనేతలపై తన నోటికి పని కల్పించారు పోసాని. అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్నారు. దాని ఫలితమే గత రాత్రి ఆయన అరెస్టుకు దారితీసింది.
అసలు పోసానిని ఎందుకు అరెస్ట్ చేశామో టీడీపీ కూడా వివరించింది. కేవలం 34 సెకన్ల నిడివి గల వీడియో రిలీజ్ చేసింది. అధినేతలను ఇంత నీచంగా మాట్లాడిన పిల్ల సైకో పాపం పండిందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. ఆ వీడియోలో పోసాని మాటలు చూస్తుంటే.. ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేశారా అని ఎవరికైనా అనిపించక మానదు.
రాత్రి ఏం జరిగింది?
రాయదుర్గం పీఎస్ నుంచి ఏపీ పోలీసులకు తోడుగా ఓ ఎస్‌ఐ, ఓ కానిస్టేబుల్ వెళ్లారు. రాత్రి 8.45 గంటలకు మై హోం భూజాలోని పోసాని ఇంటికి వెళ్లారు పోలీసులు. తాము ఎందుకు వచ్చామో పోలీసులు పోసానికి క్షుణ్ణంగా వివరించారు. ఈ క్రమంలో పోలీసులకు సహకరించకుండా వాగ్వాదానికి దిగారు పోసాని. నోటీసులు తీసుకోవడానికి ససేమిరా అన్నారు. అరెస్టు చేస్తారా? ఆడవాళ్ల మీద రౌడీయిజం ప్రదర్శిస్తారా? అంటూ కాసింత నోరు పారేసుకున్నారాయన.
ALSO READ: వైసీపీ నేత పోసాని అరెస్ట్.. ఏపీకి తరలింపు
అసలు మీరెవరు? మా ఇంటికి ఎలా వస్తారు? అని పోసాని ప్రశ్నించడంతో పోలీసులకు కాసింత మండింది. అన్నమయ్య జిల్లా ఎస్‌ఐ భక్తవత్సలం మాట్లాడుతూ మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని, ఈ విషయంలో సహకరించాలని కోరారాయన. తొలుత నోటీసు ఇవ్వండి.. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకుని వస్తానని పోలీసులకు సూచించారు పోసాని.
తమకు సహకరించకపోతే తాము డ్యూటీ చేయాల్సి వస్తుందని సంకేతాలు ఇచ్చారు పోలీసులు. దీంతో మరింత రెచ్చిపోయారు పోసాని. మా ఇంట్లోకి వచ్చి తననే కో-ఆపరేట్ చేయమంటారా? అని నిలదీశారు. కేసు నమోదైతే ఎక్కడికి వెళ్లినా అరెస్టు చేసే అధికారం తమకు ఉందని ఓ అధికారి తెలిపారు. దీంతో అసలు డ్రామాకు తెరలేపారు పోసాని. తను ఆరోగ్యం బాగలేదని, ఈ మధ్య ఆపరేషన్ చేయించుకున్నానని వివరించే ప్రయత్నం చేశారు.
కనీసం పేషంట్‌ను పట్టించుకోరా అని తన నోటికి పని కల్పించారు పోసాని. ఇదే క్రమంలో పోసాని భార్యకు నోటీసు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. మేడమ్ సార్‌ని అరెస్టు చేస్తున్నామని, నోటీసు తీసుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తీసుకోవద్దని పోసాని తన భార్యను ఆదేశించారు. పోలీసులు పదేపదే కోరినా నోటీసు తీసుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. అరెస్టు చేసుకోండంటూ కాసింత దురుసుగా బదులిచ్చారు.
తాను మాత్రలు వేసుకోవాలని పోసాని భార్య చెప్పింది. ఆయన వేసుకోవాల్సిన మందులు ఇవ్వాలని పోలీసులు సూచన చేశారు. ఏది ఎప్పుడు వేసుకోవాలో ఆయనకు తెలియదని, దగ్గరుండి అన్నీ తానే ఇస్తానని పోసాని భార్య పోలీసులకు చెప్పింది. ఇలాంటి విషయాలు తాము దగ్గరుండి చూసుకుంటామని హామీ ఇచ్చారు పోలీసులు. కొంత సమయం తీసుకున్న తర్వాత దుస్తులు మార్చుకుని పోలీసులతో వెళ్లారు పోసాని కృష్ణమురళి.
కూటమి అధికారంలోకి వచ్చాక కూడా పోసాని ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఆ తర్వాత నేతలపై కేసులు, అరెస్టుల భయంతో ఒక్కసారిగా ఆయన స్వరం మారింది. ఈ నేపథ్యంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా నని, ఇకపై ఎవరి గురించి మాట్లాడనని మీడయా ముందుకొచ్చి చెప్పారు కూడా. ఇన్నాళ్లు తనను ఆదరించారని, చనిపోయే వరకు కుటుంబం కోసం బతుకుతానని తెలిపారు. ఇక రాజకీయాల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడనని మనసులోని మాట బయట పెట్టారు. అప్పటికే పోసానిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదైన విషయం తెల్సిందే.
ఉచ్ఛ నీచాలు మరిచి, విచక్షణ లేకుండా మాట్లాడిన పిల్ల సైకో పాపం పండింది..#PillaPsychoPosaniArrest #EndOfJungleRaj #AndhraPradesh pic.twitter.com/JNZzdpT9jf
— Telugu Desam Party (@JaiTDP) February 26, 2025
BREAKING
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్
హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి అనంతపురం తరలించిన పోలీసులు
అనంతపురంలో పోసానిపై కేసు pic.twitter.com/2EeChJTDE8
— BIG TV Breaking News (@bigtvtelugu) February 26, 2025