Posani Sensational Statement: సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పోసానిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రాయచోటి జైలుకు రిమాండ్ నిమిత్తం పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోసాని సంచలన కామెంట్స్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణమురళి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగిన విషయం తెలిసిందే. అంతకుముందు జగన్ పాదయాత్ర నిర్వహించిన సమయంలో పోసాని మర్యాదపూర్వకంగా కలిసి తన మద్దతును తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే పోసాని రోజు రోజుకు తన కామెంట్స్ కు పదును పెట్టారని చెప్పవచ్చు.
ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా పోసాని మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. ఘాటు విమర్శలు చేశారని చెప్పవచ్చు. ఆ విమర్శల ప్రభావమే నేడు పోసానిని కటకటాల పాలు చేసింది. పోసాని చేసిన ఘాటు విమర్శలపై అన్నమయ్య జిల్లాలో కేసు నమోదు కాగా పోలీసులు ప్రస్తుతం అరెస్టు చేసి జైలుకు తరలించారు.
అయితే పోసానిని అరెస్టు చేసిన అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పరిచే సమయంలో రిమాండ్ రిపోర్టును పోలీసులు సమర్పించారు. ఆ రిమాండ్ రిపోర్టులో గతంలో ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే తాను విమర్శలు చేశానని, ఇదే విషయాన్ని పోసాని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అంతేకాదు పవర్ స్టార్ గా అభిమానులను ఆదరణ పొందిన పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై పోసాని ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టారని రిపోర్టులో పొందుపరిచారు. పవన్ అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే తాను అలా మాట్లాడడం జరిగిందని పోసాని అంగీకరించారని అందులో తెలిపారు. తన మాటలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే బాధ్యత సజ్జల భార్గవరెడ్డి తీసుకున్నారని, అందుకే తాను అలా మాట్లాడవలసి వచ్చిందంటూ పోసాని చెప్పారని రిమాండ్ రిపోర్టును న్యాయస్థానానికి పోలీసులు అప్పగించారు.
Also Read: TTD BR Naidu Statement: తిరుమలలో ఆ భాగ్యం మీకు దక్కాలంటే.. ఇలా చేయండి
కాగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి, అవంతి శ్రీనివాస్, డొక్కా మాణిక్య వరప్రసాద్, వాసిరెడ్డి పద్మ పలువురు ఇవే కామెంట్స్ చేయడం విశేషం. తమకు అధిష్టానం నుండి వచ్చిన ప్రకటనలతోనే తాము అలా కామెంట్స్ చేయాల్సి వచ్చిందని పలుమార్లు వీరు తేల్చి చెప్పారు. ప్రస్తుతం అవే మాటలు పోసాని రిమాండ్ రిపోర్టులో వెల్లడి కావడంతో ఏపీలో సంచలనంగా మారింది.