Posani Relief :
⦿ పోసాని, ఆర్జీవీకి హైకోర్టులో భారీ ఊరట
⦿ తొందరపాటు చర్యలొద్దని కోర్టు ఆదేశాలు
⦿ వర్మ సీఐడీ కేసులపై స్టే విధించిన ధర్మాసనం
⦿ మరోసారి అరెస్టు కాకుండా తప్పించుకున్న పోసాని, ఆర్జీవీ
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసి.. పోలీసు కేసులు ఎదుర్కొంటున్న పోసానీ, ఆర్జీవీలకు కాస్త ఊరట కలిగినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే.. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన వివిధ కేసుల్లో పోసాని వరుసగా అరెస్టులు అవుతున్నారు. ఒక కేసులో కస్టడీ పూర్తవుతుండగానే మరో కేసులో బుక్కవుతున్నారు. ఇక ఆర్జీవీ ఈ వరుసలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఏపీ హైకోర్టు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి, వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మలకు భారీ ఊరట కలిగించింది. విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాలతో ఆయన ఈ కేసుల్లో అరెస్టును తప్పించుకున్నట్లే అంటున్నారు. ఇప్పటి వరకు ఓ చోట కస్టడీ అయిపోగానే.. మరోచోట, మరో కేసుల్లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నాారు. తాజా ఆదేశాలతో అలాంటి అవకాశం లేదని అంటున్నారు. ఇది పోసానికి బిగ్ రిలీఫ్ అంటున్నారు న్యాయవాదులు. అయితే.. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు సూర్యారావు పేట, భవానీ పురం, మన్యం జిల్లా పాలకొండ పోలీసులు ఇప్పటికే పీటీ వారెంట్లు జారీ చేశారు.
మరోవైపు ఆయన్ను విచారణ చేసేందుకు ఆదోని పోలీసులు కర్నూలు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. విచారణ తీర్పును ఆదోని కోర్టు రిజర్వ్ చేసింది. ఒకవేళ కస్టడీ అనుమతి ఇస్తే న్యాయవాది సమక్షంలో ఎస్పీ కార్యాలయంలో లేదా డీఎస్పీ కార్యాలయంలో అనుమతివ్వాలని పోసాని తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గురువారం ఉదయం నుంచి బెయిల్ పిటిషన్, కస్టడీ పిటీషన్‌పై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సుదీర్ఘ విచారణ అనంతరం బెయిల్ పిటిషన్‌ను శుక్రవారానికి వాయిదా వేసింది.
మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేట, అన్నమయ్య జిల్లా ఓబులాపురం పోలీసులూ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తనపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ పోసాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే పీటీ వారెంట్ అమలు కావడంతో న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
తొలుత కేసులు మొదలైంది ఆర్జీవీ నుంచే.. ఆయన్ను ఒంగోలు పోలీసులు విచారణకు పిలిచారు. అక్కడ ఓ రోజంతా విచారణ చేసి విడిచిపెట్టారు. దాంతో.. ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలోనే ఆర్జీవీకి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. తనపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.
Also Read : Mega Brothers: మొన్న చిరు.. నిన్న పవన్.. రేపు నాగబాబు.. ఆ ముగ్గురు మొనగాళ్లు మంత్రులే!
ఈ కేసు విచారణ సందర్భంగా 2019లో విడుదలైన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై 2024లో కేసు నమోదు చేయడమేంటి? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దీన్ని కొట్టేయాలని కోర్టును వర్మ పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు సీఐడీ కేసుల్లో పేర్కొన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని, సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశాక సినిమా రిలీజ్ చేశామన్న విషయాన్ని కూడా పిటిషన్‌లో ఆర్జీవీ గుర్తు చేశారు. 2019లో సినిమా వస్తే దీనిపై 2024లో కేసు నమోదు సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ఆర్జీవీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది.