Prakash Raj: ఎవ్వరు వదిలినా నేను వదలా బొమ్మాళీ.. నేను వదలనంటే వదలా.. అనే రీతిలోనే ఉంది నటుడు ప్రకాష్ రాజ్ తీరు. ఏపీ తిరుమల లడ్డు వివాదంపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఇంకా వార్ కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిందంటూ సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో.. డిప్యూటీ సీఎం పవన్ సైతం ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు. అంతేకాదు… మహా ప్రసాదం కల్తీ పాపం వైసీపీదేనని ఆరోపిస్తూ.. తన ట్విట్టర్ వేదికగా సైతం వైసీపీపై విమర్శలు సాగించారు. అయితే ఈ వివాదం సాగుతున్న సమయంలోనే ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యారు. ఇక అంతే ఎవ్వరు ఆపినా.. నేను ఆగేదేలేదన్నట్లు ఉంది ఆయన వ్యవహారం. తాజాగా ఓ ట్వీట్ చేసి పరోక్షంగా పవన్ కు సవాల్ విసిరినట్లయింది.
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking
— Prakash Raj (@prakashraaj) October 1, 2024
లడ్డు వివాదం సాగుతున్న సమయంలో.. తొలిసారిగా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. పవన్ గారూ.. అధికారంలో ఉంది మీరే. జరిగిన కల్తీపై విచారణ సాగించండి.. అంతేగానీ సనాతన ధర్మం అంటూ ఎందుకు లేనిపోనీ వివాదాలు తీసుకు వస్తారంటూ సలహా ఇచ్చారు. అలాగే మంచు విష్ణు సైతం ప్రకాష్ రాజ్ పై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అలాగే పవన్ కూడా అదే రీతిలో స్పందించగా… ప్రకాష్ రాజ్ మాత్రం తాను విదేశాలలో ఉన్నట్లు, వచ్చాక మాట్లాడుతాను అంటూ వీడియో సైతం విడుదల చేశారు. ఆ వీడియో విడుదల చేశాక ఇక వారిద్దరి మధ్య ట్వీట్ వార్ ముగిసింది అనుకున్నారు అందరూ. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం తాను తగ్గేదెలే అన్నట్లు.. జస్ట్ ఆస్కింగ్ పేరిట రోజూ ట్వీట్ ల వర్షాన్ని కురిపిస్తున్నారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఇటీవల ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై కొంత ఘాటుగానే స్పందించారు.
Also Read: Sanatahana Dharma : సనాతన ధర్మంపై ఆ ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల మధ్య తేడా ఇదే
తాజాగా లడ్డు వివాదం సుప్రీంకోర్టుకు చేరగా.. కొంత కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురైందని చెప్పవచ్చు. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు, దేవుడిని రాజకీయం చేయవద్దు అంటూ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనితో కూటమిపై సోషల్ మీడియా వేదికగా పలువురు ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయంపై ప్రకాష్ రాజ్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే.. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ? ఇక చాలు ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి… జస్ట్ ఆస్కింగ్ అని ఉంది. అంటే పరోక్షంగా ఈ మాటలు పవన్ కు చెప్పారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొత్త భక్తుడు అంటే పవన్ అని, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్.. ఇక ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడాలని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దన్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద ఎవ్వరు వదిలినా.. నేను వదలను అన్న రీతిలో ప్రకాష్ రాజ్ ట్వీట్ ల వర్షం కురిపిస్తుండగా.. ఇక ఈ విషయంపై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.