BigTV English

CM Progress Report: ఏపీలో రూ.53 వేల కోట్లతో ప్రాజెక్టులకు ఆమోదం.. 30 ప్రాజెక్టులివే!

CM Progress Report: ఏపీలో రూ.53 వేల కోట్లతో ప్రాజెక్టులకు ఆమోదం.. 30 ప్రాజెక్టులివే!

CM Progress Report: కుప్పానికి కృష్ణమ్మ చేరింది.. ఇచ్చిన మాటను అమలు చేసి చూపించారు సీఎం చంద్రబాబు నాయుడు. అదే సమయంలో ఈ వారంలో ఏపీ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు పర్యాటక రంగానికి, వైద్య రంగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు..కొన్ని అమలు కూడా చేశారు.


25-08-2025 (సోమవారం) (జలవనరుల శాఖపై సమీక్ష )
కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు సీఎం చందబ్రాబు. జలవనరుల శాఖ సంబంధిత అంశాలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాయలసీమలోని చెరువుల్ని తక్షణం నింపేందుకు చర్యలు చేపట్టాలని, పోలవరం ఎడమకాలువ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని నిర్దేశించారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని కాలువల ద్వారా మళ్లించి చెరువుల్లోకి పంపాలని సూచించారు. సముద్రంలోకి వృథాగా ప్రవాహాలు వెళ్తుంటే బాధ కలుగుతోందన్నారు. వరద నీటిని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు చంద్రబాబు.

25-08-2025 (సోమవారం) ( వైద్యరంగంపై సమీక్ష)
వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, ఆరోగ్య బీమాలో మార్పులు, కొత్త వైద్య కళాశాలలు, ఉచితంగా వైద్య పరీక్షలు, యోగా–నేచురోపతి అభివృద్ధి వంటి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పేదలపై మందుల కొనుగోలు భారం తగ్గేలా ప్రతీ మండలంలో జనరిక్ ఔషధాలు లభించేలా చూడాలని ఆదేశించారు. జనఔషధి స్టోర్లు పెట్టేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి పెద్దఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని.. తక్షణమే వాటికి అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు వైద్య బీమా అందించే పథకాన్ని 1.63 కోట్ల కుటుంబాలకు వర్తించేలా మార్పులు చేయాలని సూచించారు.


25-08-2025 (సోమవారం) ( భారత్ బయో డిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్)
వైద్య ఆరోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్ బయో డిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆసియా పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్‌కు చెందిన వేర్వేరు దేశాల వైద్యనిపుణులతో సీఎం సమావేశమై చర్చించారు. అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో అంతర్భాగంగా ఈ రీసెర్చి ఇన్నోవేషన్ కార్యకలాపాలు ఉండనున్నాయి. ఏఐ, మెడ్ టెక్ అలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసియా-పసిఫిక్ బయోడిజైన్ అలయన్స్, అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్ ఫోర్డ్ బయోడిజైన్ సంయుక్త భాగస్వామ్యంలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆరోగ్య రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో, నూతన ఆవిష్కరణల లక్ష్యంగా పని చేస్తారు.

25-08-2025 (సోమవారం) ( స్త్రీ శక్తి పథకంపై సమీక్ష)
స్త్రీ శక్తి పథకంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 8 వేల 458 ఆర్టీసీ బస్సుల్లో ఈ పథకం అమలవుతోంది. ఈ పథకం గ్రాండ్‌ సక్సెస్ అయ్యిందన్నారు సీఎం చంద్రబాబు. ఈ పథకం కారణంగా బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని అధికారులు వివరించారు. ఎంత మంది మహిళలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. స్త్రీశక్తి శక్తి పథకం కింద నడిపే బస్సులకు వెనుక, ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తంగా 8 వేల 458 స్ర్తీ శక్తి బస్సులకు బోర్డులు పెట్టాలని చెప్పారు. సీట్లకోసం పోటీ పడితే ఆర్టీసీ సిబ్బంది సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

26-08-2025 (మంగళవారం) ( బ్యాంకర్ల కమిటీ సమావేశం)
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలుకీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. బ్యాంకులు, పబ్లిక్‌ పాలసీలు ఎప్పుడూ ప్రజలను నియంత్రించకూడదన్నారు. బలహీన వర్గాలకు బ్యాంకులు బాసటగా ఉండాలని, నైపుణ్యాభివృద్ధి కోసం ఆర్థిక తోడ్పాటునివ్వాలని కోరారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ పెన్యూయర్ విధానంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి 8వ తేదీ నాటికి లక్ష మంది పారిశ్రామికవేత్తలను చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులోకోసం బ్యాంకర్లు పూర్తిగా సహకరించాలని కోరారు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, MSME, డ్వాక్రా గ్రూపులకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం చంద్రబాబు వివరించారు.

26-08-2025 (మంగళవారం) (అమరావతిలో ప్రధాన కేంద్రాలు)
రాజధాని అమరావతిలో బ్యాంకులు తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. బ్యాంకులన్నీ కలిసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌నును ఏర్పాటు చేయాలని సూచించారు. అమరావతిలో బ్యాంకులకు అవసరమైన భూమిని కేటాయిస్తామని.. రెండేళ్లలో అమరావతిలో బ్యాంకులు తమ కార్యాలయాలను నిర్మించాలన్నారు. బీసీ కార్పోరేషన్, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ల ద్వారా రుణాల కోసం వచ్చే దరఖాస్తులను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు.

27-08-2025 (బుధవారం) ( గణనాథుడి సేవలో సీఎం చంద్రబాబు)
విజయవాడ సితార సెంటర్ లో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ప్రార్థించానన్నారు. గత ప్రభుత్వంలో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలంటే అనేక ఆంక్షలు ఉండేవన్నారు. కానీ ఇప్పుడలాంటి పరిస్థితి లేదన్నారు.

28-08-2025 (గురువారం) ( 30 ప్రాజెక్టులకు ఆమోదం)
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జిరగింది. 53 వేల 922 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు ఈ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 83 వేల 437మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇకనుంచి ప్రతీ నెలా సమీక్షస్తానని సీఎం మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్టుల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో మంత్రులూ పరిశీలించాలన్నారు. ఇప్పటివరకూ అనుమతులిచ్చిన ప్రాజెక్టుల వివరాలను, ఉత్పత్తి ప్రారంభించేందుకు ఎంత సమయం పట్టిందన్న అంశాలను విశ్లేషించాలని సీఎం సూచించారు. ఏరోస్పేస్‌, IT, ఇంధనం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, MSME రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. నవంబర్‌ 15లోగా MSME పార్కులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. బిజినెస్‌ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టం తయారు చేయాలని సూచించారు.

28-08-2025 (గురువారం) ( ఉల్లి కొనుగోళ్లపై సమీక్ష)
ఉల్లి రైతులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఉల్లి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. క్వింటాలుకు 1200 చెల్లించి రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలోని రైతు బజార్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. రైతులు నష్టపోకుండా, వినియోగదారులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని, ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో రైతు బజార్ల సంఖ్యను పెంచాలని, మార్కెట్ యార్డుల్లో ఆధునిక రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.

28-08-2025 (గురువారం) ( ఉల్లి రైతులను ఆదుకుంటాం)
మహారాష్ట్రలో ఉల్లి పంటను ఎక్కువగా సాగు చేయడం.. రాష్ట్రంలో పంట దెబ్బతిన్న కారణంగా ధరల విషయంలో రైతులు ఇబ్బందిపడుతున్నారని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. వచ్చే పది రోజుల్లో 5 వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వచ్చే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇబ్బందుల్లో ఉన్న ఉల్లి రైతును ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఉన్న రైతు బజార్ల సంఖ్యను 150 నుంచి 200 వరకూ పెంచేలా ప్రణాళిక చేయాలన్నారు సీఎం చంద్రబాబు. రైతు బజార్లను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాలని… మార్కెట్ యార్డుల్లోని 2-3 ఎకరాల భూమిని వినియోగించుకుని కొత్తగా ఆధునిక రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు.

28-08-2025 (గురువారం)
ఏపీ సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్‌ కార్డ్ తరహాలో.. ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్డులో ప్రభుత్వ పథకాలు సహా.. అన్ని వివరాలు పొందుపర్చాలని.. ఎప్పటికప్పుడు వివరాలను అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించడం.. ఏదైనా పథకం అవసరమైతే వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ రూపొందించాలని కూడా సమావేశం నిర్ణయించింది. కేవలం ప్రభుత్వ పథకాలు అందుకోవడం కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రావొద్దన్నారు సీఎం చంద్రబాబు.

29-08-2025 (శుక్రవారం) ( హాప్‌ ఆన్‌.. హాప్‌ ఆఫ్.. )
విశాఖలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మరో ముందుడుగు వేసింది. దీని కోసం ఏపీ పర్యాటకశాఖ హాప్ ఆన్.. హాప్‌ ఆఫ్‌.. బస్సులను ప్రారంభించింది. ఈ బస్సులను సీఎం చంద్రబాబు బీచ్‌ రోడ్‌లో ప్రారంభించారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా ప్రయాణించారు సీఎం చంద్రబాబు. విశాఖ బీచ్‌లను ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలన్నారు చంద్రబాబు. ఈ బస్సులు ఆర్కే బీచ్‌ నుంచి తొట్లకొండ వరకు ప్రయాణించనున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 16 కిలోమీటర్లు. ఇందులో టికెట్ ధర 500 రూపాయలు కాగా.. సగం ధరను ప్రభుత్వం భరించనుంది. 250 రూపాయలు చెల్లించి.. 24 గంటల పాటు ప్రయాణించచ్చు. విశాఖలో డాటా సెంటర్‌, సీ కేబుల్ కూడా త్వరలో ఏర్పాటు కాబోతుందన్నారు సీఎం చంద్రబాబు.

29-08-2025 (శుక్రవారం) ( ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్‌ సదస్సు )
విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్‌ సదస్సులో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఏపీకి 9 శాతం వాటా ఉందన్నారు ఆయన. దీని విలువ 50 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు. ఉద్యాన, ఆక్వారంగంలోనూ చాలా బలంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తి 15.6 శాతం ఉదని, అతి త్వరలోనే దీన్ని 25 శాతానికి తీసుకెళ్తామన్నారు సీఎం. ఒక్కసారి దరఖాస్తు చేస్తే అన్ని అనుమతులు ఇస్తామని ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ వ్యాపారాన్ని నడుపుకోవచ్చని హామీ ఇచ్చారు. వేగంగా వచ్చి పరిశ్రమ ప్రారంభిస్తే తాము సాయం చేస్తామని హామీ ఇచ్చారు. పీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ద్వారా పరిశ్రమలకు ప్రోత్సాహకాలిస్తున్నామని, 200 కోట్ల పెట్టుబడులు దాటితే మెగా ప్రాజెక్టుగా పరిగణించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా, సుస్థిరంగా మార్చటమే తన లక్ష్యమని వెల్లడించారు.

30-08-2025 (శనివారం) కృష్ణమ్మకు జలహారతి
రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చి రతనాల సీమగా మార్చాలన్నదే తమ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు . కుప్పంలో పర్యటించిన ఆయన.. పరమసముద్రం చెరువు సమీపంలో కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నంద్యాలలోని మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి 738 కిలోమీటర్లు ప్రయాణించి కుప్పానికి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కాలువ విస్తరణ, లైనింగ్ పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి బోటులో కూడా ప్రయాణీంచారు సీఎం.

30-08-2025 (శనివారం) కృష్ణమ్మకు జలహారతి
కుప్పానికి నీరు తెచ్చేందుకు 27 లిఫ్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు సీఎం చంద్రబాబు. 2028లో వచ్చే కృష్ణా పుష్కరాలు కుప్పానికి ఈ ఏడాదే వచ్చాయన్నారు. పోలవరం-బనకచర్ల నుంచి వంశధార-పెన్నా వరకు నదుల అనుసంధానం జరిగితే ఏపీలో కరువు అనేదే ఉండదన్నారు.

30-08-2025 (శనివారం) ఆర్టీసీ బస్సులో సీఎం
పరమసముద్రం చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు చంద్రబాబు. శాంతిపురం మండలం శివపురంలోని స్వగృహం నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలు, ప్రయాణీకులతో కలిసి ఆయన ప్రయాణించారు. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందంటూ మహిళలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సులో ప్రయాణించారు.

Story By Vamshi Krishna, Bigtv

Related News

CM Chandrababu: సీఎం బాబు @30.. సాక్షిలో ఊహించని ప్రచారం

Miss Visakhapatnam 2025: విశాఖ అందాల తార ఈ యువతే.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!

AP rains: వరుణుడి ఉగ్రరూపం.. ఈ జిల్లాల పైనే.. బిగ్ అలర్ట్ అంటున్న అధికారులు!

AP Politics: అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. అన్నా రాంబాబు బ్యాడ్ టైమ్..

AP Heavy Rains: మళ్లీ ఏర్పడ్డ అల్పపీడనం.. మూడు రోజుల పాటు భారీ వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

Big Stories

×