Rajahmundry 10th Class Student: ఓ వైపు జీవితంలో ఎంతో ముఖ్యమైన పదో తరగతి పరీక్షలు.. మరోవైపు ప్రాణాలనే కబళించే తాచుపాము కాటు. అయితే ప్రాణాలను కూడా లెక్క చెయ్యకుండా ఆ విద్యార్ధి టెన్త్ ఎక్జామ్స్ రాశాడు. 3 రోజుల పాటు పరిశీలనలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామన్న డాక్టర్స్.. పాము కాటుకు చికిత్స పొందుతూనే పదో తరగతి పరీక్ష రాశాడో విద్యార్థి. రాజమండ్రి రాజానగరం మండలం శ్రీకృష్ణ పట్టణానికి చెందిన నిస్సి అనే విద్యార్థి.. అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షల కోసం ఓ చెట్టు కింద చదువుకుంటూ పక్కనే ఉన్న రాయి కింద వేలు దూర్చాడు. ఏదో కుట్టినట్లుగా అనిపించి.. రాయి పక్కకి తీసి చూడటంతో తాచుపాము కనిపించింది.
అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మూడు రోజులపాటు ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అయితే సోమవారం పరీక్షలు ప్రారంభం కావడంతో ఆసుపత్రి నుంచే ఉదయం నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాశాడు. ఓ పక్క చికిత్స పొందుతున్నా ధైర్యాన్ని వీడకుండా పరీక్ష రాసిన నిస్సిని పలువురు ప్రశంసించారు.
సాధారణంగా పాములు పొలాలు, అడవుల్లోనూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో.. నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే చెట్లను ఎక్కువగా నరికివేయడం వల్ల పాములు జనాల్లోకి వచ్చేస్తున్నాయి. దీనికి తోడు పారిశ్రామికీకరణ వల్ల నీటి కాలుష్యం పెరగడంతో అవి బయట తిరుగుతున్నాయి. అందులో ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది. వేడి తాపానికి పాములు తేమ కోసం జనాలు ఉండే ప్రాంతాల్లోకి సంచరిస్తూ ఉంటాయి. పాముల బెడద తగ్గాలంటే.. విచ్చలవిడిగా అడవులను నరికి వేయడం ఆపాలి.
Also Read: వదలని కేసులు.. మళ్లీ కస్టడీకి పోసాని!
నీటి కాలుష్యాన్ని తగ్గించాలి. పాము కరిచినప్పుడు.. మంత్ర వైద్యం. నాటు వైద్యం కాకుండా తప్పనిసరిగా హాస్పటల్‌కి వెళ్లి చికిత్స తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్య వహించకూడదు. ముఖ్యంగా భయపడకుండా.. ధైర్యంగా ఉంటే సగం బ్రతికినట్లే..