Rajalingamurthy murder Case: తెలంగాణలో సంచలనం రేపిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ-8గా ఉన్న నిందితుడు హరిబాబును అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు పోలీసులు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న సమయంలో ఢిల్లీలో అరెస్టు చేశారు.
హరిబాబుకు సహకరించిన ములుగు జిల్లా మంగపేటకు చెందిన దంపతులను సైతం అరెస్ట్ చేశారు. తన సహాయకులతో కలిసి పోలీసులకు చిక్కకుండా ఢిల్లీలో హరిబాబు తలదాచుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, సిమ్లా, అమృత్ సర్ లాంటి ప్రదేశాలు సందర్శించి చివరకు ఢిల్లీలో చిక్కాడు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే క్రమంలో చిక్కాడు. క్రెడిట్ కార్డు వినియోగం ఆధారంగా హరిబాబును పట్టుకున్నారు.
హనుమకొండకు చెందిన సన్నిహితుడి క్రెడిట్ కార్డు తీసుకెళ్లి హరిబాబు వినియోగించినట్టు సమాచారం. ఫిబ్రవరి 20 నుంచి నిందితుడు హరిబాబు పరారీలో ఉన్నాడు. నిందితుడు హరిబాబు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ప్రధాన అనుచరుడు. తన భర్త హత్యకు హరిబాబు స్కెచ్ వేశాడని రాజలింగమూర్తి భార్య సరళ ప్రధాన ఆరోపణ.
అసలేం జరిగింది?
ఫిబ్రవరి 20న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నాగవల్లి సరళ భర్త రాజ లింగమూర్తిని దారుణ హత్యకు గురయ్యారు. కత్తులతో విచక్షణ రహితంగా ఆయనపై దాడి చేసి చంపేశారు. ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు ఆయన మృతి చెందాడు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి సైతం సీరియస్ అయ్యారు.
ALSO READ: భిక్షాటన రహిత సమాజాన్ని ప్రతిబింబిస్తున్న ధర్మయుగం
తొలుత భూముల వ్యవహారమని భావించినప్పటికీ, మృతుడి భార్య సరళ మాత్రం అంగీకరించలేదు. కావాలనే తన భర్తను చంపేశారని ఆరోపించింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు.
మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజలింగమూర్తి. ఈ కేసుపై విచారణ జరుగుతుండగానే ఆయన హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ యవ్వారంపై అధికార కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగింది.
హత్య వెనుక
రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడులో సోదరుల ఇంట జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. టూ వీలర్స్‌పై తన గ్రామానికి తిరిగి వస్తున్నారు ఆయన. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆఫీసుకు ఎదురుగా రోడ్డును దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి ఆయన్ని చుట్టుముట్టారు. తమతో తెచ్చుకున్న కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు.
దుండగుల కత్తిపోట్ల కారణంగా ఆయన పేగులు బయటకు వచ్చాయి. ఆయన్ని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. రాజలింగమూర్తి హత్య వెనుక కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక కీలక నిందితులు ఉన్నారని మృతుడి భార్య ఆరోపించారు. చివరకు ఢిల్లీలో చిక్కాడు కీలక నిందితుడు హరిబాబు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితుడ్ని కస్టడీనికి తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు పోలీసులు. కస్టడీలో అసలు నిజాలు బయటకు వస్తే కీలక వ్యక్తులు చిక్కడం ఖాయమని అంటున్నారు.
రాజలింగమూర్తి హత్య కేసులో A8 గా ఉన్న కొత్త హరిబాబును ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
గత కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న హరిబాబు
హరిబాబు అరెస్ట్ తో ఈ హత్యకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడే అవకాశం https://t.co/jtbYXNegxL pic.twitter.com/bDYmhmgntj
— BIG TV Breaking News (@bigtvtelugu) March 18, 2025