Ramzan 2025: రంజాన్ మాసం నెలవంక కనిపించింది. నెలవంక కనిపించడంతో రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు మార్చి 2 వ తేదీ నుండి అంటే ఆదివారం నుండి ప్రారంభించనున్నారు. మాసం ప్రారంభం కావడంతో ఉపవాసాలను ముస్లిం సోదర సోదరీమణులు ఆచరిస్తారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు ఉపవాసాన్ని ఆచరించడం ఆచారంగా వస్తోంది. నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షను ముస్లింలు ఆచరించడం విశేషం. అంతేకాకుండా 5 పూటల నమాజును ఆచరించడంతో పాటు, తరావీహ్ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఆచరించి అల్లాహ్ ను పూజించడం ద్వారా ముస్లింలు తమ భక్తితత్వాన్ని చాటుకుంటారు.
ఉపవాసాల సందర్భంగా తెల్లవారుజామున సహరి ద్వారా భోజనాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత ఎటువంటి ఆహారాన్ని, నీటిని స్వీకరించకుండా ఉపవాస దీక్షను ముస్లింలు సాయంత్రం వరకు కొనసాగిస్తారు. మగ్ రిబ్ నమాజ్ కు ముందు ఇఫ్తార్ ద్వారా ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష ఆచరించిన అనంతరం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు జరుపుకుంటారు. ఈ రంజాన్ మాసంలో పవిత్ర గ్రంథం ఖురాన్ ను పఠిస్తూ, ఎక్కువ సమయం అల్లాహ్ సేవకు కేటాయిస్తారు. అయితే ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులను అందించడం మన దేశంలో మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.
ఈ మాసంలో ముస్లింలు దానధర్మాలు చేస్తారు. ఉపవాసాలు ఆచరించడం వెనుక పేదల ఆకలికేకలను అర్థం చేసుకొని, సాయం అందించాలన్న దృక్పథం కలిగించడమేనని ముస్లిం మత పెద్దలు తెలుపుతారు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఈ నెల మొత్తం ముస్లింల ప్రార్థనా మందిరాలైన మసీదులు కిటకిటలాడుతాయి. ఇప్పటికే మసీదులను ప్రత్యేక ఆకర్షణగా అలంకరించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇప్పటికే ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గంట సమయం ముందుగా కార్యాలయాల నుండి వెళ్లే అవకాశాన్ని కల్పించాయి.
ఏపీలో మసీదులలో పని చేసే ఇమామ్, మౌజన్ లకు అందించే పెండింగ్ గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనితో రంజాన్ మాసానికి ముందుగానే తమకు ప్రభుత్వం కానుక అందించిందని ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రంజాన్ మాసం ప్రారంభం సంధర్భంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నెల వంక కనిపించింది. పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైంది. నెలంతా ఉపవాసాలు, పవిత్ర ఖురాన్ పఠనం, తరావీ నమాజ్ భక్తి శ్రద్ధలతో చేపట్టే ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు. అల్లా దయతో క్రమశిక్షణ, శాంతి, సహనం, దాన గుణంతో కఠోర ఉపవాస దీక్షలు సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు లోకేష్ తెలిపారు.
Also Read: Tirumala News: తిరుమల ఇక నో ఫ్లయింగ్ జోన్? కేంద్రానికి లేఖ రాసిన టీటీడీ చైర్మన్..
హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్..
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదీలకు గుడ్ న్యూస్ చెప్పారు. ముందుగా నెలవంక కనిపించిన సంధర్భంగా ముస్లింలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నెల సంధర్భంగా వ్యాపారులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 24 గంటలూ దుకాణాలు ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2 వ తేదీ నుండి మార్చి 31 వరకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. దీనితో చార్మినార్ వద్ద మిడ్ నైట్ షాపింగ్ కు వ్యాపారులు సిద్దమవుతున్నారు.
కనిపించిన నెలవంక.. రంజాన్ మాసం ప్రారంభం
రేపటి నుంచి ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు
ఈ ఏడాది మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రంజాన్ మాసం pic.twitter.com/UTgQuaL7Vs
— BIG TV Breaking News (@bigtvtelugu) March 1, 2025