YSRCP: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీని టార్గెట్ చేయడంలో ఆంతర్యం ఏమిటి..? ముఖ్యంగా జిల్లాలో వైసిపికి ముఖ్య నేతలుగా ఉన్న మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ టార్గెట్ చేయడం వెనుక రాజకీయ లెక్కలున్నాయా? బీజేపీని బలోపేతం చేసిన నరసాపురంలో తాను పొలిటికల్‌గా సెటిల్ అవ్వడానికి స్కెచ్ గీస్తున్నారా?
నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనావాసవర్మ
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బీజేపీ పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న భూపతి రాజు శ్రీనివాస వర్మ రాజకీయంగా కూటమి నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ నింపడానికి వైసిపికి మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో రాజకీయంగా కూడా శ్రీనివాస వర్మ నరసాపురం పార్లమెంటు సెగ్మెంట్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి, వైసిపిని పశ్చిమగోదావరిలో పూర్తిస్థాయిలో అణగ తొక్కడానికి స్కెచ్ గీస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు చూస్తే విభజిత పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి పార్టీలే గెలిచాయి. టీడీపీ ఎమ్మెల్యేలలో కేవలం ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు మాత్రమే వైసీపీ నాయకుల తీరును ఎండ గడుతూ వస్తున్నారు., మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం వైసిపి నాయకులపై ఏమాత్రం స్పందించడం లేదు. ఇదే నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కూడా చేరినట్లు తెలుస్తోంది.
హాట్ టాపిక్‌గా మారిన వర్మ పొలిటికల్ స్టైల్
అయితే కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ బాధ్యతను ఒక్కరే భుజాన వేసుకుని వైసిపి ముఖ్య నేతలను టార్గెట్ చేసుకుంటూ కూటమి బలోపేతానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ రాజకీయ స్టైల్ ఇప్పుడు ఇప్పుడే హాట్ టాపిక్ గా మారింది. వైసిపి నేతలకు సైతం శ్రీనివాస వర్మ రాజకీయం, ఆయన దూకుడు, చేస్తున్న విమర్శలు మింగుడు పడటం లేదంట. ఎంపీగా, కేంద్ర మంత్రిగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ జిల్లా రాజకీయంపై పూర్తిగా దృష్టి పెట్టడంలో శ్రీనివాస వర్మ భవిష్యత్తు రాజకీయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసిపి ముఖ్య నేతలు భావిస్తున్నారంట. అయితే శ్రీనివాస వర్మ వ్యాఖ్యలకు ధీటుగా వైసిపి మాజీ మంత్రులు స్పందించలేక పోతుండటం చర్చనీయాంశంగా మారింది
పశ్చిమలో బలమైన వైసీపీ నేతలపై మండిపడుతున్న వర్మ
పశ్చిమగోదావరి జిల్లాలో వైసిపికి బలమైన నేతలు అయిన తణుకు మజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అంటేనే మండి పడిపోతున్నారు కేంద్ర సహాయ మంత్రి వర్మ. వైసిపి కార్యకర్తల్లో జోష్ నింపడానికి అటు కారుమూరి, ఇటు కొట్టు చేసే విపరీత కామెంట్లను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ నరసాపురం బీజేపీ ఎంపీ దూకుడు ప్రదర్శిస్తున్నారు.. రాబోయే సంస్థ గత ఎన్నికల్లో కూటమిలో మరింత బలం నింపేలా కార్యకర్తలను సమాయత్త పరచడానికే వర్మ అంత అగ్రెసివ్‌గా ఉంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేంద్ర మంత్రిపై విమర్శలకు సంశయిస్తున్న వైసీపీ నేతలు
ఎవరేమనుకుంటారో పట్టించుకోకుండా కేంద్ర క్యాబినెట్లో ఉన్న వర్మ ఎప్పటికప్పుడు జిల్లా ప్రతిపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు . వర్మ కేంద్రమంత్రి కూడా కావడంతో ప్రతిపక్ష నేతలు తిరిగి విమర్శించడానికి కొంత ఆలోచిస్తున్నారంట. నరసాపురం పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోలో కూటమి బలాన్ని పెంచేందుకు వర్మ రాజకీయ స్వైర్య విహారం చేస్తున్నారని చెప్తున్నారు కూటమి కార్యకర్తలు. కూటమిలో అన్ని పార్టీలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తూ తన దగ్గరకు ఏ పార్టీ కార్యకర్త వచ్చినా వారి పనులను చేయటంలో ముందుంటున్నారు వర్మ. నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా కూడా ఉన్నారు కాబట్టి నరసాపురం పార్లమెంటును అభివృద్ధి పథంలో నడిపించడానికి అధికారులను ఎప్పటికప్పుడు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.
Also Read: ఉత్తరాది రాష్ట్రా్ల్లో భారీ వర్షాలు.. పొంగిపోర్లుతోన్న వాగులు, వంకలు..
వర్మ స్పీడ్‌తో ముక్కున వేలు వేసుకుంటున్న వైసీపీ
అంతేకాకుండా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ బిజెపి నాయకులు, కార్యకర్తలకు, అటు టీడీపీ, జనసేన శ్రేణులకు అందుబాటులో ఉంటూ, అందర్నీ కలుపుకుని పోతూ వారు అడిగిన పనులను చేయడంలో సక్సెస్ అవుతుండటంపై కూటమి శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పశ్చిమగోదావరి జిల్లాలో కూటమికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అత్యంత బలమైఅండగా ఉన్నారనడటంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు . గత సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ప్రజలకు పెద్దగా పరిచయం లేని బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పీడ్‌ను తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీ నేతలు ఏంటి వర్మ జోరు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారంట. కేంద్ర మంత్రిగా చక్రం తిప్పుతున్న వర్మకు ఏ విధంగా స్పీడ్ బ్రేకర్లు వేయాలని తమలో తాము మధన పడిపోతున్నారు వైసిపి నేతలు.
story By Rami Reddy, Bigtv