Kannappa Movie Review : మంచు ఫ్యామిలీ కన్నప్ప మూవీ అనౌన్స్ చేసిన నాటి నుంచి ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే, ఆ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సహా అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి బడా స్టార్స్ కూడా ఉండటంతో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రభాస్ కోసమే సినిమాకు వెళ్లే వాళ్లు ఉన్నారు. అలాంటి సినిమా ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చేసింది. మరి మంచు విష్ణును ఆ శివయ్యా కాపాడాడా ? ఆయనకు హిట్ వచ్చిందా ? ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా ఏ మాత్రం కిక్ ఇచ్చిందో ఈ రివ్యూలో చూద్దాం..
కథ :
తిన్నడు (మంచు విష్ణు) చిన్ననాటి నుంచే దేవుడిని నమ్మడు. కానీ, తండ్రి నాథనాథుడు (శరత్ కుమార్) మాటను తప్పడు. అలాగే వాళ్ల గూడెంకు ఏ కష్టమొచ్చినా ముందు ఉంటాడు. ఈ క్రమంలోనే మరో గూడెంకు చెందిన యువరాణి నెమలి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడుతాడు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ల గూడాన్ని వీడాల్సి వస్తుంది. అయితే ఓ సారి కాల ముఖుడు (అర్పిత్ రాంకా) వాయు లింగాన్ని సాధించుకునే టైంలో తిన్నడుతో యుద్దం చేస్తాడు. ఆ యుద్ధం టైంలోనే తిన్నడి తండ్రి నాథనాథుడు చనిపోతాడు. ఆ పగతో కాలముఖుడిని తిన్నడు చంపేస్తాడు.
ఆ తర్వాత ప్రశాంతంగా ఉన్న తిన్నడు జీవితంలోకి రుద్ర (ప్రభాస్) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది ? వాయు లింగం గొప్పతనం ఏంటి ? మహాదేవశాస్త్రీ (మోహన్ బాబు) పాత్ర ఏంటి ? కిరాతా (మోహన్ లాల్)కు కన్నప్ప గత జన్మకు సంబంధం ఏంటి ? మొత్తానికి తిన్నడు పరమ శివ భక్తుడిగా ఎలా మారాడు అనేది స్టోరీ.
విశ్లేషణ :
కన్నప్ప అంటే.. కృష్ణం రాజు తీసిన భక్త కన్నప్ప సినిమానే గుర్తొస్తుంది అందరికీ. కన్నప్ప సినిమా అంటే, శివ లింగానికి కన్నప్ప కళ్లు ఇవ్వడమే. కృష్ణం రాజు భక్త కన్నప్పలో కూడా అదే చూపించాడు. కానీ, ఇక్కడ భక్త కన్నప్ప జీవితం, అలాగే అతని గత జన్మ అనేవి ప్రేక్షకులకు చూపించాడు. దాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తెరమీదకు తీసుకొచ్చారా అంటే… సగం మార్కులు వేసేలా తీసుకొచ్చారని చెప్పొచ్చు.
ముఖ్యంగా తిన్నడు కన్నప్పగా మారకముందు ఎలా ఉన్నాడో అనేది హైలైట్ చేస్తూ చూపించాలని అనుకున్నారు. కానీ, అదే సినిమాకు కాస్త మైనస్ అయింది. తిన్నడు గురించి చూపించిన ఎపిసోడ్ మొత్తం బోరింగ్ కంటెంట్ లానే ఉంది. కాలముఖుడితో చేసే భారీ యుద్దం కూడా ఆడియన్స్ కు పెద్దగా ఎక్కదు.
యుద్దం తర్వాత రుద్ర పాత్ర (ప్రభాస్) ఎంట్రీ వస్తుంది. ఆ పాత్ర సినిమాకు జీవం పోసింది అని చెప్పొచ్చు. దీని తర్వాత వచ్చే ప్రతి సీన్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోతారు. ప్రభాస్ పాత్ర దాదాపు 20 నిమిషాల వరకు ఉంటుంది. ఆ 20 నిమిషాలు కన్నార్పకుండా చూస్తారు. ఆ తర్వాత క్లైమాక్స్ లో 20 నిమిషాలు శివ భక్తులకు పూనకాలు తెప్పిస్తుంది.
ఇక కాస్త డీటైల్‌గా చూస్తే, ఫస్టాఫ్ లో సినిమా స్టార్ట్ అవ్వడమే… విష్ణు కూతర్లతో ఓ సాంగ్ పెట్టించాడు. ఆ సాంగ్ బానే ఉంది. అక్కడ వచ్చే విజువల్స్ బానే ఉన్నాయి. కానీ, ఆ ఇద్దరూ సెట్ అవ్వలేదు. వాళ్లు వేసే డ్యాన్స్ కూడా ఇమిడినట్టు అనిపించలేదు. దీని తర్వాత తిన్నడి చిన్ననాటి పాత్రను విష్ణు కొడుకు చేశాడు. ఆ పాత్ర ప్లేస్‌లో వేరే ఎవరైనా చైల్డ్ ఆర్టిస్ట్‌ను తీసుకుంటే బాగుండు అనిపించింది. విష్ణు కుమారుడు అనే ఒకే ఒక అర్హత తప్పా ఇంకేం లేదు అనే చెప్పాలి.
ఇక తర్వాత సినిమాలో లవ్ ట్రాక్. తిన్నడి జీవితంలో అలాంటిది కూడా ఉన్నాయని చూపించాలని అనుకున్నారు తప్పులేదు. కానీ, రొమాన్స్ కాస్త శృతిమించినట్టు అనిపించింది. ఫస్టాఫ్ అప్పటికే బోరింగ్ లా సాగుతుంటే ప్రాధాన పాత్రలు అయిన విష్ణు – ప్రీతి ముకుందన్ మధ్య వచ్చే సాంగ్స్ ఇరిటేషన్స్ తెప్పిస్తాయి. ఆ పాటల టైంలో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకి వెళ్లాడం కూడా జరిగింది.
వీరి మధ్య పెట్టిన రెండు సాంగ్స్ ను సినిమా నుంచి పూర్తిగా తొలగించినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పైగా సినిమా నిడివి తగ్గించినట్టు అవుతుంది. యుద్దం ఎపిసోడ్‌ను మరింత బలంగా పెట్టే స్కోప్ ఉంది.
అలాగే వీఎఫ్ఎక్స్ వెరీ పూర్. అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి వీఎఫ్ఎక్స్ చేస్తారని ఎవ్వరూ అనుకోరు. చివరికి సినిమాకు మెయిన్ పాత్ర అయిన… శివుడికి కూడా వీఎఫ్ఎక్స్ సెట్ అవ్వలేదు. మెడలో పాము కదలకుండా అలానే ఉంటే, బొమ్మ పామా అనే ఫీల్ వస్తుంది. అలాగే అక్షయ్ కుమార్ శరీరాకృతి కోసం కూడా వీఎఫ్ఎక్స్ వాడినట్టు స్పష్టంగా తెలుస్తుంది.
ఇక సెకండాఫ్ లో ప్రతి సీన్ అలరిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ, తర్వాత క్లైమాక్స్. లాస్ట్‌లో శివుడి దర్శనం అన్నిటినీ బాగా డిజైన్ చేశారు.
ఇక ఫర్ఫామెన్స్ గురించి మాట్లాడితే, పైన చెప్పినట్టే… సెకండాఫ్‌లోనే విష్ణు బాగా చేశాడు. ఫస్టాఫ్‌లో విష్ణు చేసిన యాక్టింగ్ ట్రోల్ కంటెంట్‌లా ఉందనే కామెంట్స్ వస్తాయి. ప్రభాస్ గురించి కొత్తగా ఏం చెప్పలేం. ఆయన పాత్రే సినిమాకు జీవం పోసింది. మధ్యలో ప్రభాస్ నుంచి కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా వస్తాయి. శివుడిగా అక్షయ్ కుమార్ బాగా చేశాడు. కానీ, డబ్బింగ్ కాస్త చూసుకోవాల్సింది. లిప్ సింక్ సరిగ్గా లేదు. మోహన్ లాల్ పాత్ర 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఉన్నంతలో బానే చేశాడు.
హీరోయిన్ ప్రీతి ముకుందన్ కావాల్సిన దాని కంటే ఎక్కువ అందాల ఆరబోత చేసిందని అనిపిస్తుంది. ముఖ్యంగా హీరోతో ఉన్న రెండు సాంగ్స్‌లో మరీ ఎక్కువ. అవి చూస్తే మనం ఓ భక్తి సినిమాకు వచ్చాము అనేది మర్చిపోతాం. ఇక నిర్మాణ విలువల గురించి మాట్లాడితే, న్యూజిలాండ్‌లో చేయడం రియాలిటీ మిస్ అయిందే ఫీల్ వస్తుంది. వీఎఫ్ఎక్స్ వర్క్‌లో జీరో మార్కులు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శివుడి సాంగ్స్ కాబట్టి మ్యూజిక్ కు బాగా కలిసొచ్చింది.
ప్లస్ పాయింట్స్ :
ప్రభాస్ సీన్స్
క్లైమాక్స్ & క్లైమాక్స్‌లో విష్ణు నటన
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
సెకండాఫ్
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్
హీరోయిన్‌తో ఉన్న రెండు సాంగ్స్
వీఎఫ్ఎక్స్
ల్యాగ్ సీన్స్
లోకేషన్స్
మొత్తానికి : శివయ్య కాదు కని రుద్ర కాపాడాడు
Kannappa Movie Rating : 2.5 / 5