Rain Alert : వెదర్ మారిపోయింది. ముసురు కమ్మేసింది. ఉన్నట్టుండి మబ్బులు. రెండు వారాలుగా ఎండలతో అల్లాడిపోగా.. అసలైన వర్షాకాలం ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతికి అల్పపీడనం తోడు అయిందని.. వానలు దంచికొడతాయని తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఉపరితల ఆవర్తనం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. వీటి ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన కురుస్తుందనేది వెదర్ రిపోర్ట్. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయట. గురువారం రాత్రి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. తెలంగాణలో మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
అల్పపీడనం, ఆవర్తనం వల్ల ఏపీలోనూ గట్టి వానలే పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కోస్తా, రాయలసీమకు వాన ముంపు పొంచి ఉంది. మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉంది. గంటలకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. విశాఖ నుంచి పోలవరం వరకు కోస్తా బెల్ట్ మొత్తం వానకు తడిసిముద్ద అవ్వాల్సిందే. రాయలసీమలోనూ వానలు కుమ్మేయనున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
ఇక, కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో ఇప్పటికే పలుచోట్ల వర్షం వచ్చిపోతోంది. గురువారం నైట్ నుంచి అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సిటీలో రెయిన్ అంటే మామూలుగా ఉండదు మరి. నీళ్లు జామ్.. ట్రాఫిక్ జామ్‌తో జనాలు బేజార్ అవ్వాల్సిందే. రానున్న 3 రోజుల్లో.. భారీ వర్షాలు అంటున్నారు కాబట్టి.. హైదరాబాదీలు జర జాగ్రత్త.