ABV on Jagan: ఏపీకి చెందిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు అంటే తెలియని వారే ఉండరు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తన ఉద్యోగంకై న్యాయస్థానాల్లో పోరాటం చేసి, చివరగా రిటైర్డ్ అయ్యే రోజు బాధ్యతలు చేపట్టి, సాయంత్రం పదవీ విరమణ పొందిన అధికారిగా ఏబీ వెంకటేశ్వరరావు సంచలనం సృష్టించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, తనను కక్షపూరితంగా వేధించిందన్నది ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణ. అయితే నాటి వైసీపీ ప్రభుత్వం పైనే ధిక్కార స్వరం వినిపించి, చివరకు న్యాయస్థానం ద్వారా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి, అదే రోజు ఏబి వెంకటేశ్వరరావు పదవీ విరమణ పొందారు.
తాజాగా రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును ఉద్దేశించి మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేసేలా పోలీస్ శాఖను ప్రయోగిస్తున్నారన్నారు.
ఈ అరెస్టులపై సీఎం చంద్రబాబుకు సలహాలు ఇచ్చేందుకు ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, నిరంతరం సీఎం సచివాలయంలో తిష్ట వేసి ఉంటున్నారని ఆరోపించారు. అలాగే ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ పేర్లను ఉచ్చరించి ఏక వచనంతో జగన్ సంభోదించారు. ఈ ముగ్గురు రిటైర్డ్ అధికారులు అన్ని జిల్లాలలో, వైసీపీ నేతల చిట్టాను ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా తెప్పించుకుని పక్కా ప్రణాళికతో అరెస్టుల పర్వం సాగిస్తున్నట్లు ఆరోపించారు.
జగన్ చేసిన ఆరోపణలపై రిటైర్డ్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.. మాట సరి చేసుకో.. భాష సరిచూసుకో అంటూ కౌంటర్ ఇచ్చారు. ఒకసారి ప్రజలు విశ్వాసం కోల్పోయినా.. ఒకసారి నోరు జారినా.. తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేరని, నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను అంటూ.. అలాగే తెర వెనుక భాగోతాలు నడపను అంటూ రిప్లై ఇచ్చారు. అలాగే నేనేంటో.. తలవంచని నా నైజం ఏమిటో గడిచిన ఐదేళ్లలో నువ్వే చూశావ్.. బి కేర్ ఫుల్ అంటూ ఆయన హెచ్చరించారు. ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన హెచ్చరికలపై మాజీ సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
మిస్టర్ జగన్ రెడ్డీ….నోరు అదుపులో పెట్టుకో….మాట సరిచేసుకో…భాష సరిచూసుకో! ఒక సారి ప్రజల విశ్వాసం కోల్పోయినా…ఒక సారి నోరు జారినా….తిరిగి వాటిని ఎన్నటికీ పొందలేరు. నీలా కుసంస్కారంతో నేను మాట్లాడను. తెరవెనుక భాగోతాలు నడపను.
— ABV Rao (@abvrao) November 21, 2024