Rachamallu Sivaprasad Reddy: మహిళలు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయన్నది పాత మాట. కానీ మందుబాబులు తలుచుకుంటే.. పార్టీల విధి రాతలు కూడా తారుమారు అవుతాయన్నది ఇప్పటి మాట. మందుబాబులా మజాకా.. మందుబాబులు అనుకుంటే ఏదైనా జరగాల్సిందే.. జరిగి తీరాల్సిందే. వీరి నుండి ఒక్కరోజు ఆదాయం ఆగిందా.. అంతా శూన్యమే. అందుకే ప్రభుత్వ ఖజానా నిండాలంటే.. మందుబాబుల తర్వాతే ఎవరైనా. అయితే మేము చేసిన ఒక్క తప్పుకు మమ్మల్ని ఓడించారు. ఇప్పుడైనా వారికి న్యాయం చేయండి అంటున్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మేల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.
ఏపీ ఎన్నికల సమయంలో మందుబాబులదే హవా. అంటే మందుబాబులను టార్గెట్ చేసుకొని ఇప్పటి సీఎం చంద్రబాబు బహిరంగ సభలో.. మద్యం సీసా చేతబట్టి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని, అలాగే తాము అధికారంలోకి వస్తే, నాణ్యమైన మద్యం అందిస్తామన్నారు. అప్పటి వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయన్న ఆరోపణలు ఎక్కువగా వినిపించేవి. అది కూడా కొత్త కొత్త కంపెనీల పేర్లతో మద్యం బ్రాండ్స్ మార్కెట్ లోకి రాగా, మందుబాబులు ప్రత్యక్షంగానే ఆరోపణలు చేసేవారు.
ఈ తరుణంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా మందుబాబులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అది కూడా మద్యం కొత్త పాలసీ తీసుకువచ్చి, కేవలం రూ. 99 లకే క్వార్టర్ బాటిల్ అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. అలాగే మంచి బ్రాండ్స్ కూడా మార్కెట్ లోకి రాగా, మందుబాబులు దిల్ ఖుషీగా ఉన్నారనే చెప్పవచ్చు. తాజాగా మందుబాబులపై వైసీపీకి చెందిన మాజీ ఎమ్మేల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మేల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. తన ఓటమికి, వైసీపీ ఓటమికి మందుబాబులే కారణమన్నారు. మద్యం ధరలు తగ్గిస్తామని మందుబాబులకు మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. నాణ్యమైన మద్యం అందిస్తామని మభ్యపెట్టి మోసం చేశారని, ఇతర రాష్ట్రాల్లో రూ.85 లకే వచ్చే చీప్ లిక్కర్, ఆంధ్రలో 100 రూపాయలుగా విక్రయిస్తున్నారన్నారు. ఇప్పటికైనా మందుబాబుల ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించి, వెంటనే ధరను తగ్గించాలని రాచమల్లు డిమాండ్ చేశారు.
నా ఓటమికి, వైసీపీ ఓటమికి మందుబాబులే కారణం : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
మద్యం ధరలు తగ్గిస్తామని మందుబాబులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు.
నాణ్యమైన మద్యం అందిస్తామని మభ్యపెట్టి మోసం చేశారు.
ఇతర రాష్ట్రాల్లో రూ.85 లకే వచ్చే చీప్ లిక్కర్ ఆంధ్రలో వంద… pic.twitter.com/F2AmwMdP4F
— BIG TV Breaking News (@bigtvtelugu) November 21, 2024