శుక్రవారం వస్తే రాష్ట్రం వదిలి జంప్.. మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలివి. ఆమె ఎవర్ని ఉద్దేశించి ఆ మాటలు అన్నారనేది అప్రస్తుతం, అవి ఎవరికి తగిలేలా ఉన్నాయనేదే అసలు విషయం. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ జగన్ చేస్తున్న పని ఇదే. ప్రతి శుక్రవారం ఆయన బెంగళూరు వెళ్తున్నారు. తిరిగి సోమవారం తాడేపల్లికి వస్తున్నారు. అంటే వీకెండ్ అక్కడికి, వీక్ డేస్ లో ఇక్కడ. ఇలా ఉంది ఆయన పరిస్థితి. మరిప్పుడు రోజా మాటలు జగన్ పై సెటైర్లేనా అని అనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ మొదలైంది.
పవన్ పై రోజా కౌంటర్..
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తోంది. మీ నాయకుడు ఎన్నిసార్లు బెంగళూరు వెళ్లాడో తెలుసా అని కూటమి నేతలు ప్రశ్నిస్తే, మీ నాయకులు ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్లారో తెలుసా అంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్, జగన్ చేసిన విమాన ప్రయాణాలు ఎన్ని అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ దశలో మాజీ మంత్రి రోజా, పవన్ ని టార్గెట్ చేస్తూ సెటైర్లు పేల్చారు. శుక్రవారం వస్తే చాలు జంప్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
పవన్ కల్యాణ్ ఇటీవల తరచూ హైదరాబాద్ వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తన సినిమాల షూటింగ్ కోసమే హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఎన్నికల ముందు కమిట్ అయిన సినిమాలను వరసబెట్టి పూర్తి చేస్తున్నారు పవన్. ఇటీవలే హరిహర వీరమల్లు విడుదలైంది, ఇప్పుడు ఓజీ థియేటర్లలోకి వస్తోంది. ఇకపై ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి హాజరవుతారు. అది పూర్తయిన తర్వాత కొత్త సినిమాలేవీ లేవు కాబట్టి ఏపీలోనే ఉండిపోతారు. అయినా కూడా పవన్ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరవుతున్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని జనసేన నేతలు గొప్పగా చెబుతున్నారు. జగన్ మాత్రం వీకెండ్ బెంగళూరులో రిలాక్స్ అవుతూ, వీక్ డేస్ లో మాత్రం తాడేపల్లికి వస్తున్నారని కౌంటర్ ఇస్తున్నారు.
ఎవరు బెటర్?
ప్రజలకు అందుబాటులో ఉంటున్న పవన్ బెటరా? నాయకులకు కూడా దొరక్కుండా బెంగళూరు పారిపోతున్న జగన్ బెటరా అని జనసేన నేతలు రోజాని సూటిగా ప్రశ్నిస్తున్నారు. జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని, వారు ఎమ్మెల్యేలుగా గెలిచి ఉపయోగమేంటని నిలదీస్తున్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్నవారయితే కచ్చితంగా అసెంబ్లీకి హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడాన్ని కవర్ చేసుకోలేక ఆ పార్టీ నేతలు ఇలా రివర్స్ లో విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. ఒకరకంగా చూస్తే రోజా వ్యాఖ్యలు పవన్ కంటే, జగన్ కే కరెక్ట్ గా సరిపోతాయని సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. సొంత పార్టీ నాయకుడికే రోజా కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు. జగన్ బెంగళూరు పర్యటనల గురించి ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారని, ఇప్పుడు రోజా దీనిపై మరింత పెద్ద చర్చ పెట్టారని సెటైర్లు పేలుస్తున్నారు.