Encounter: ఆపరేషన్ కగార్ పుణ్యమా అని గత కొంతకాలంగా మావోయిస్టుల టైమ్ అస్సలు బాగోలేదు అనే చెప్పాలి. వరుస ఎన్‌కౌంటర్లలో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే మావోయిస్టు అధినేతలే టార్గెట్‌గా భద్రతా బలగాలు వ్యూహాలు రచిస్తూ సక్సెస్ అవుతున్నారు. దీంతో ఈ మధ్య లొంగిపోయే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. లెటెస్ట్‌గా దంతెవాడ జిల్లాలో 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ జిల్లాలో ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. లొంగిపోయిన వారిలో పలువురు అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తోంది. లొంగిపోయిన వారిలో 30 మందిపై 64 లక్షల రివార్డు ఉంది.
లొంగిపోయిన వారికి ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు
లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారు. వీరందరికి ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది. గత కొన్ని నెలలుగా మావోయిస్టులు లొంగిపోయేందుకు వీలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పోలీసులు. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ దంతేవాడ, జగదల్‌పూర్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఈ లొంగుబాటుకు సంబంధించి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. లొంగిపోయిన వారికి ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు అందించనున్నారు. అంతేగాకుండా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం కింద ట్రైనింగ్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
ఇద్దరు మావోయిస్టులు మృతి..
మరోవైపు నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. దండకారణ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు జార్ఖండ్‌లో కూడా భద్రతా బలగాలకు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టులకు ఒకే రోజు అనేక మాస్టర్ స్ట్రోక్స్ తగిలినట్టైంది.
భద్రతా బలగాల వేట ఇలాగే కొనసాగితే…
దండకారణ్యాన్ని ఓ కంచుకోటగా మార్చుకొని భద్రతా బలగాలను ముప్పు తిప్పలు పెట్టిన మావోయిస్టులు ఇప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనేది అర్థమవుతోంది. దీనికి కారణం భద్రతా బలగాల వ్యూహం మారడమే. అధినాయకత్వాన్ని టార్గెట్ చేయడమే అని చెప్పవచ్చు. మరి భద్రతా బలగాల వేట ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటన్నది చూడాలి. మావోయిస్టులతో చర్చలు జరిపే ఉద్దేశం ఏ మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఆయుధాలు వదిలి వచ్చి లొంగిపోవడం తప్ప వారికి మరే ఆప్షన్ లేదని తేల్చి చెబుతున్నారు.
ALSO READ: Police Constable: 7565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనం, ఇంటర్ పాసైతే చాలు