Vijayawada News: ప్రస్తుత సమాజంలో కట్నం అనే సామాజిక దురాచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సమస్య కేవలం సామాన్య పౌరులకే కాకుండా.. కొన్నిసార్లు చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే దీనికి పాల్పడటం విచారకరం. తాజాగా ఓ పోలీస్ అధికారి అదనపు కట్నం కోసం అరాచకానికి దిగిన సంఘటన చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో ఆర్ఎస్ఐ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, కట్నం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. యువతి కుటుంబం నుండి అదనపు డబ్బు రాబట్టేందుకు బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఇటువంటి చర్యలు చట్ట విరుద్ధం అని తెలిసి కూడా పోలీస్ అధికారే ఇలా చేయడం దారుణం… కట్నం నిషేధ చట్టం 1961 ప్రకారం, కట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం నేరం. అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు సమాజంలో ఇంకా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
పెళ్లైన మొదటి నుంచే టార్చర్
అదనపు కట్నం కోసం ఆర్ఎస్ఐ అరాచకానికి పాల్పడ్డాడు. మాట్లాడుకుందామని పంచాయితీకి పిలిచి… అతని భార్యపై, అత్తామామాలపై, బామ్మరిదిపై దారుణంగా దాడి చేశాడు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, వేదాద్రికి చెందిన ప్రవీణ్ కుమార్ కు ఖమ్మం జిల్లా మధిరకు చెందిన రాజ్యలతతో 2024 ఏప్రిల్ నెలలో వివాహమైంది. హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న చల్లా ప్రవీణ్ కుమార్.. పెళ్లైన మొదటి రోజు నుంచే భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. రోజురోజుకీ టార్చ్ ఎక్కువ కావడంతో.. వేధింపులు భరించలేని రాజ్యలత తను ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో స్వయంగా ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామని విజయవాడకు పిలిచాడు.
మాట్లాడుకుందామని పిలిచి కర్రలతో దాడి..
రాజ్యలత తల్లిదండ్రులు, బంధువులు మాట్లాడేందుకు విజయవాడకు వెళ్లిన తర్వాత ఆర్ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వారిపై దాడికి దిగాడు. కర్రలతో, రాడ్లు, కుర్చీలతో వారిని ఇష్టమొచ్చినట్టు కొట్టారు. భార్యను జుట్టు పట్టుకుని దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో రాజ్యలత తరుఫున బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యక్తులే ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే, సమాజంలో న్యాయం ఎలా నెలకొంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన కట్నం వ్యవస్థను నిర్మూలించేందుకు మరింత కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేస్తోంది. ఇలాంటి పోలీస్ అధికారులపై ప్రభుత్వం, పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే సమాజంలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంట్లో బంధించి టార్చర్ చేశాడు: రాజ్యలత
ఈ ఘటన జరిగిన తర్వాత తమకు జరిగిన వేధింపుల గురించి రాజ్యలత బిగ్ టీవీతో చెప్పుకుంది. ‘2024 ఏప్రిల్ నెలలో మాకు వివాహమైంది. అదే ఏడాది ఆగస్టు నెలలో హైదరాబాద్ లో ఫ్యామిలీ పెట్టాం. కట్నం కింద రూ.10లక్షల నగదు, రూ.10 లక్షల గోల్డ్, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఒక ఫ్లాట్ ఇచ్చాం. అయితే పెళ్లయిన రెండు నెలల నుంచి చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేశాడు. 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇంటికి రిజిస్ట్రేషన్ చేయాలని వేధింపులకు గురిచేశాడు. చివరి ఆరు నెలల నుంచి అతని వేధింపులు ఎక్కువయ్యాయి. ఆరు నెలలుగా నన్ను ఇంట్లోనే బంధించి.. పుట్టింటికి వెళ్లకుండా ప్రవీణ్ కుమార్ టార్చర్ చేశాడు. గత నెలలో అతనే మా ఇంటికి పంపించి.. పంచాయతీ పెట్టుకుందామని విజయవాడకు పిలిపించి.. మా తల్లిదండ్రులు, అన్నయ్య, నాపై దారుణంగా దాడి చేశాడు’ అని రాజ్యలత వాపోయింది.