చంద్రబాబు వివిధ కేసుల్లో బెయిల్ పై తిరుగుతున్నారని, తమ ప్రభుత్వ హయాంలో స్కిల్ స్కామ్ లో ఆయన్ను జైలుకి పంపించామని, ఇంకోసారి కూడా పంపించే అవకాశం వచ్చినా వదిలేశామని అన్నారు సజ్జల. ఈరోజు నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణిని సజ్జల పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే సజ్జల వ్యాఖ్యలకు వెంటనే టీడీపీ కౌంటర్లు మొదలు పెట్టింది. చంద్రబాబుని ఒకసారి జైలుకి పంపితేనే వైసీపీ 11 సీట్లకు పరిమితం అయిందని, రెండోసారి కూడా పంపించి ఉంటే వైసీపీ నామరూపాల్లేకుండా పోయేదని టీడీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు.
తప్పుడు కేసులు..
వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు సజ్జల. కూటమి పాలనలో వ్యవస్థలు దారుణంగా విఫలమయ్యాయని విమర్శించారు. మాజీ మంత్రి కాకాణిని తప్పుడు కేసులో ఇరికించారని, ఆధారాలు లేకుండానే ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారని అన్నారు. కాకాణితోపాటు వైసీపీ నేతలపై వరుసగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, కల్పిత కథనాలతో కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు పరాకాష్టకి చేరిందన్నారు. అక్రమ కేసులతో కూటమి ప్రభుత్వం ఎవర్నీ భయపెట్టలేదని, జైలునుంచి బయటకు వచ్చిన నేతలు మరింత రాటుదేలతారని చెప్పారు సజ్జల.
కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కేసులో ఉద్దేశపూర్వకంగానే కొన్ని సెక్షన్లు యాడ్ చేసి అరెస్ట్ చేశారు
వైయస్ఆర్సీపీ నేతలకి ఒక కేసులో బెయిల్ రాబోతోందని తెలియగానే మరో కేసుతో రిమాండ్ కోరుతున్నారు
సోషల్ మీడియాలో పోస్టింగ్స్ సంబంధించిన కేసుకి కిడ్నాప్ సెక్షన్లు యాడ్ చేసి అరెస్ట్… pic.twitter.com/cwFKYMbRev
— YSR Congress Party (@YSRCParty) May 31, 2025
ముందే ఊహించాం..
కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ కక్షసాధింపులు ఉంటాయని తాము ముందే ఊహించామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వారు ఎంతగా అణగతొక్కాలని చూస్తే తాము అంత బలపడతామని, అంతే బలంగా తమ పార్టీ పైకి లేస్తుందన్నారు. ఇలాంటి తప్పుడు సాంప్రదాయాలు సరికాదన్నారు. ఈ తప్పుడు సాంప్రదాయాలు ముందు ముందు కూడా కొనసాగితే దాని పరిణామాలు భవిష్యత్తులో మరింత ఘోరంగా ఉంటాయన్నారు.
మేం రెడీ..
తాము అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చామని, దేనికైనా సిద్ధం అని అన్నారు సజ్జల. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దారుణంగా విఫలమైందని విమర్శించారు. పోలీసుల ఎదుట బట్టల్లేకుండా డ్యాన్స్ లు చేస్తున్నా వారు పట్టించుకోవడం లేదని, పోలీసులు కూటమి నేతలు చెప్పినట్టల్లా ఆడుతున్నారని అన్నారు. తెనాలిలో ముగ్గురిని నడిరోడ్డుపై పోలీసులు దారుణంగా కొట్టారని.. ఇలాంటి సంప్రదాయాలు మంచిది కాదని అన్నారు సజ్జల.
భవిష్యత్తు భయంకరం..
కూటమి పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు సజ్జల. కూటమికి పాడె కడతారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబులో మార్పు రాకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుందని చెప్పారు. అయితే సజ్జల హెచ్చరికల్ని సోషల్ మీడియాలో టీడీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. భవిష్యత్తు భయంకరంగా ఉండేది వైసీపీకేనని వారు చెబుతున్నారు. తప్పుడు కేసులు పెట్టడం వైసీపీ హయాంలో జరిగిందని, ఇప్పుడు తప్పులు చేసిన వారిపైనే కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలంతా వరుస కేసులతో జైళ్లకు వెళ్లడంతో ఆ పార్టీలో అలజడి రేగింది. అయితే మిగతా నాలుగేళ్లు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని వారు ఫిక్స్ అయ్యారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని అప్పుడు బదులు తీర్చుకుంటామని చెబుతున్నారు. జగన్ కూడా 2029లో తిరిగి తామే అధికారంలోకి వస్తామని, అప్పుడు కచ్చితంగా జవాబు చెబుతామంటున్నారు.