YS Jagan: జగన్ ఎక్కడ??? బెంగళూరులోనా? తాడేపల్లి ప్యాలెస్‌లోనా? కడప పులివెందులలోనా? ఏమో. ఈ ప్రశ్నకు ఆన్సర్ అంత ఈజీ కాదు. టకీమని చెప్పలేరు. జగన్ పరిస్థితి అలా ఉంది మరి. బెంగళూరుకు డైలీ ప్యాసింజర్‌లా.. ఏపీకి టూరిస్ట్‌లా గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు…అని వైసీపీ వర్గాలే అంటున్నాయి.
జగన్ ఇప్పుడేం చేస్తున్నారా? ఇది మరింత టఫ్ క్వశ్చన్. అసెంబ్లీకి రారు. ప్రజల్లో ఉండరు. బయటకి కనిపించరు. అసలు ఎక్కడున్నారో కూడా తెలీదు. అలాంటప్పుడు అసలేం చేస్తున్నారనేది మరింత ట్విస్ట్. సభ జరుగుతుంటే.. ప్రెస్‌మీట్లు పెట్టి తాను చెప్పాల్సింది చెప్పడం మినహా ప్రతిపక్ష నేతగా ఆయన ఈమధ్య కాలంలో పెద్దగా చేసింది ఏమీలేదనే విమర్శ ఉంది. కానీ, ప్రతిపక్ష నేత హోదా కోసం మాత్రం గట్టిగా మాట్లాడుతున్నారు. అప్పటి వరకూ అసెంబ్లీకి రానంటే రానంటున్నారు. ప్రజలకు నాయకత్వం వహించలేక.. తన రాజకీయ ఉనికి కోసం తాపత్రయపడుతున్నారనే ఆరోపణ ఉంది. ఇక్కడో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి…
వైసీపీకి రెడ్ బుక్ టెన్షన్:
జగన్‌ను చూడాలనుకుంటే.. ఏ జైలు ముందో మకాం వేస్తే కనిపించే ఛాన్సెస్ ఉంటాయంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. వివిధ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకెళ్లిన వైసీపీ ప్రముఖ నాయకులను చెరసాలలో పరామర్శించడానికి మాత్రం తప్పకుండా వస్తున్నారు. అసలే పార్టీ ఓడిపోయి ఉంది. టాప్ లీడర్లను రెడ్ బుక్ వెంటాడుతోంది. వంశీ, పోసాని లాంటి నోటి దురుసు నేతలంతా ఊచలు లెక్కబెడుతున్నారు. కొడాలి లాంటి వాళ్లు లోకేశ్ పేరెత్తితేనే ఉలిక్కిపడుతున్నారు. ఎప్పుడు ఏ లీడర్‌కు బేడీలు పడుతాయోనని బెంబేలెత్తుతున్నారు. ఇలాంటి టైమ్‌లో నేనున్నానంటూ పార్టీ నేతలకు భరోసా ఇచ్చేలా బయటకు వస్తున్నారు జగన్. పోలీసుల తాటతీస్తానంటూ మీడియా ముందు సీమ డైలాగ్స్ తో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అధికారపక్షం ఎద్దేవా చేస్తోంది.
జగన్ ఫ్యూచర్ ఏంటి? చంద్రబాబును తట్టుకోగలరా?
ఇదంతా పక్కనపెడితే.. ఇంతకీ జగన్ ఫ్యూచర్ ఏంటి? మళ్లీ రాజకీయంగా నిలదొక్కుకోగలరా? దేవుడి దయ, ప్రజల దీవెనలతో.. వైసీపీకి మళ్లీ మంచి రోజులు వస్తాయా? అధికారం కోల్పోయి దాదాపు ఏడాది సమయం గడుస్తున్న వేళ.. ఈ చర్చ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ చర్చ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది. మా జగనన్న మళ్లీ కచ్చితంగా సీఎం అవుతారని సొంతపార్టీ నేతలే బలంగా, నమ్మకంగా చెప్పలేకపోతున్నారనేది నిజంగా నిజం. సీఎం చంద్రబాబు తనదైన పరిపాలనా దక్షతతో ప్రజల అభిమానం దోచుకుంటున్నారు. డ్రోన్ టెక్నాలజీ నుంచి రాజధాని అమరావతి వరకు అన్నిట్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఇసుక ఇబ్బందులు లేవు. లిక్కర్ దోపిడీ లేదు. ఉపాధి అవకాశాలకు ఢోకా లేదు. P4 అంటూ ప్రజలకు చేరువవుతూ.. ప్రతిపక్షాన్ని పరేషాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబునాయుడు.
ఎవడ్రా పవన్ కల్యాణ్‌ను అపేది?
ఏపీలో అసలు ప్రతిపక్షం ఎక్కడుంది? నెంబర్ వన్ పార్టీ టీడీపీకి తిరుగులేదు. నెంబర్ టూ జనసేన జోరు మీదుంది. మిత్రపక్షంగా బీజేపీలో ఫుల్ జోష్. ఇటీవలి పిఠాపురం, చిత్రాడ జయకేతనంతో పవన్ కల్యాణ్ తన పొలిటికల్ స్టామినాను బలంగా చాటారు. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని తామే గెలిపించామంటూ ఇన్‌డైరెక్ట్‌గా స్ట్రాంగ్ మెసేజే ఇచ్చారు. ఏపీలో పదేళ్లు కూటమి ప్రభుత్వానిదేనని విజయకేతనం ఎగరవేశారు. 12 ఏళ్లలో జీరో నుంచి పొలిటికల్ పవర్ స్టార్ గా ఓ రేంజ్ కు ఎదిగిన పవన్ కల్యాణ్‌ను ఇప్పట్లో ఆపేది ఎవడ్రా? ..అని జనసైనికులు మాంచి హుషారు మీదున్నారు. చేగువేరా నుంచ సనాతన్ వరకు.. హిందీ నుంచి సౌత్ ఇండియా వరకు.. ఫ్యూచర్‌లో తన పొలిటికల్ గ్రాఫ్‌కు బౌండరీస్ లేవని చెప్పకనే చెప్పేశారు. దటీజ్ పవన్ కల్యాణ్. అటు, బీజేపీ సైతం మోదీ ఇమేజ్‌తో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులతో రేసులో నేనున్నానంటోంది.
జగన్‌కు విజయసాయి, బాలినేని గండం?
ఇలా.. టీడీపీ, జనసేన, బీజేపీలు ఫుల్ స్వింగ్ మీద ఉండగా.. ఏపీ పొలిటికల్ పిక్చర్‌లో వైసీపీకి స్పేస్ ఉందా? లేదా? అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓవైపు నోటికి పని చెప్పే నేతలంతా వరుసగా జైళ్లకు క్యూ కడుతున్నారు. రెడ్ బుక్‌లో పేజీలు గిరగిరా తిరుగుతున్నాయి. మరోవైపు, విజయసాయిరెడ్డి లాంటి వైట్ కాలర్ లీడర్లు జగన్‌ను వదిలేస్తున్నారు. పదుల సంఖ్యలో ఉన్న పాత కేసుల్లో A1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గుట్టంతా సాయిరెడ్డి చేతుల్లో ఉందని అందరూ అంటారు. అలాంటి విజయసాయి ఇప్పుడు వైసీపీని వీడి.. తమ మాజీ అధినేతపై యుద్ధానికి రెడీ అవుతుంటే జగన్‌కు చిక్కులు తప్పేలా లేవంటున్నారు. ఇప్పటికే దగ్గరి బంధువు బాలినేని సైతం జగన్‌పై బాంబులేస్తున్నారు. తన ఆస్తులు దోచుకున్నారంటూ.. జగన్ పరువు మరింతగా బజారుకీడుస్తున్నారు. చెల్లి షర్మిలను జగన్ నట్టేట ముంచారనే విమర్శ ఆయన్ను బాగా డ్యామేజ్ చేసింది. బాలినేని లేటెస్ట్ ఆరోపణలు జగన్ క్యారెక్టర్‌ను మరింత కుళ్లబొడుస్తున్నాయి. ఇక, విజయసాయిరెడ్డి సైతం జగన్ దోపిడీ గురించి నోరు విప్పడం స్టార్ట్ చేస్తే…? జగన్ ఢమాల్.. అనే అంటున్నారు.
ఇలా అన్నివైపుల నుంచి, అన్ని రకాలుగా జగన్ పొలిటికల్ సినిమా సినిగి పోతుంటే.. ఆయన మాత్రం ప్రెస్ మీట్లు పెడుతూ.. మళ్లీ బలంగా కొడతానంటూ.. డైలాగులతో భయాన్ని దాచేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ ముఖచిత్రం ఇలానే కంటిన్యూ అయితే.. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డికి మరింత కష్టాలు తప్పకపోవచ్చు.. ఆయన, ఆయన పార్టీ ఉనికే కష్టంగా మారొచ్చు అనే వాదన వినిపిస్తోంది. పార్టీని, నేతలను, కేడర్‌ను జగన్ ఎలా కాపాడుకుంటారో…!