Indian Railways: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగించే పలు రైళ్లను దారి మళ్లించారు. ఇప్పటికే పలు రైళ్లను చర్లపల్లి నుంచి నడుపుతున్నారు. తాజాగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వచ్చే రైళ్లు ఇకపై సికింద్రాబాద్ లో ఆగవని సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఈ రైళ్లు నేరుగా చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్తాయని తెలిపింది. ఇకపై అక్కడి నుంచే రాకపోకలు కొనసాగించనున్నట్లు వెల్లడించింది.
ఏ రైళ్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగవంటే?
⦿ విశాఖపట్నం- హజూర్ సాహిబ్ నాందేడ్- విశాఖపట్నం (రైలు నెం. 20811/20812) ట్రై-వీక్లీ ఎక్స్ ప్రెస్ ఏప్రిల్ 26 నుంచి సికింద్రాబాద్ లో ఆగదు. నేరుగా చర్లపల్లికి వెళ్తుంది. విశాఖపట్నం నుంచి హజూర్ సాహిబ్ నాందేడ్ కు వెళ్లే రైలు ఉదయం 6:45 గంటలకు చర్లపల్లిలో ఆగుతుంది. తిరిగి వచ్చే సమయంలో ఈ రైలు రాత్రి 9:15 గంటలకు ఇదే స్టేషన్‌లో ఆగుతుంది.
⦿ విశాఖపట్నం-సాయి నగర్ షిర్డీ-విశాఖపట్నం (రైలు నెం. 18503/8504) వీక్లీ ఎక్స్ ప్రెస్ ఈ నెల 24 నుంచి సికింద్రాబాద్ లో కాకుండా నేరుగా చర్లపల్లిలో ఆగుతుంది. ఈ రైలు రాత్రి 8:10 గంటలకు చర్లపల్లిలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 8:45 గంటలకు ఆగుతుంది.
⦿ విశాఖపట్నం- లోకమాన్య తిలక్- విశాఖపట్నం డైలీ ఎక్స్ ప్రెస్(రైలు నెం. 18503/18504) ఇకపై మౌలాలి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగదు. విశాఖపట్నం నుంచి వెళ్లే రైలు మధ్యాహ్నం 12:35 గంటలకు చెర్లపల్లిలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు రాత్రి 8:15 గంటలకు అక్కడే ఆగదు. ఏప్రిల్ 22 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది.
⦿ విశాఖపట్నం- లింగంపల్లి- విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్(రైలు నెం. 12805/2806) ఏప్రిల్ 24 నుంచి సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్లలో ఆగదు. విశాఖపట్నం నుంచి లింగంపల్లి వరకు నడిచే ఈ రైలు సాయంత్రం 6:05 గంటలకు చర్లపల్లిలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 7:15 గంటలకు అదే స్టేషన్‌లో ఆగుతుంది.
Read Also: కాశ్మీర్ అందాలు చూడాలనుందా? తక్కువ ధరలో స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన IRCTC!
సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగని ఇతర రైళ్లు
⦿ తిరుపతి- ఆదిలాబాద్- తిరుపతి కృష్ణ ఎక్స్ ప్రెస్(రైలు నెం. 17405/17406) సికింద్రాబాద్- మల్కాజ్ గిరి మార్గం కాకుండా బొల్లారం మీదుగా వెళ్తుంది. ఏప్రిల్ 26 నుంచి ఈ రైలు మల్కాజ్ గిరి, మౌలా అలీ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగదు.
⦿ లింగంపల్లి- కాకినాడ టౌన్- లింగంపల్లి ఎక్స్ ప్రెస్(రైలు నెం. 07446/07445) ఏప్రిల్ 2 నుంచి సనత్ నగర్ నుంచి అమ్ముగూడ బైపాస్ ద్వారా చెర్లపల్లి వైపు మళ్లిస్తారు. సికింద్రాబాద్ లో ఈ రైలు ఆగదు.
⦿ కాజీపేట-హడప్సర్- కాజీపేట (రైలు నంబర్ 17014/17013) రైలు ఏప్రిల్ 22 నుంచి బేగంపేట స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగదు.
⦿ సికింద్రాబాద్-కర్నూల్ సిటీ- సికింద్రాబాద్ తుంగభద్ర ఎక్స్ ప్రెస్(17023/17024) ఏప్రిల్ 10 నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు బదులుగా కాచిగూడ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.
Read Also: రైలు టికెట్ ను ఫ్యామిలీ మెంబర్స్ కి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?