YS Jagan : రాప్తాడులో జగన్ పర్యటన రచ్చ రచ్చ అవుతోంది. ఆ పోలీసుల బట్టలూడదీస్తానని వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. అదే సమయంలో జగన్ ప్రయాణించే హెలికాప్టర్ డ్యామేజ్ కావడంపైనా రాజకీయ రగడ కొనసాగుతోంది. హెలికాప్టర్‌పై పరిటాల సైన్యం రాళ్లు, కర్రలు విసిరేశారని.. హెలికాప్టర్ డోర్ దెబ్బతిందని.. సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. జగన్‌కు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని అందుకే ఇలా జరిగిందంటూ వైసీపీ అంటోంది. ఇలా జగన్ హెలికాప్టర్ చుట్టూ నెలకొన్న వివాదంపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న స్పందించారు. అసలేం జరిగిందో ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
హెలిప్యాడ్ దగ్గర అసలేం జరిగిందంటే..
ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులతో జగన్ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఇచ్చామని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. పోలీసుల సూచనలు పట్టించుకోకుండా వైసీపీ నాయకులు భారీగా జనాన్ని తరలించారని.. అందుకే హెలిప్యాడ్ దగ్గర పరిస్థితి అదుపు తప్పిందని చెప్పారు. 150 మంది పోలీసులను తొలుత మోహరించామని.. జనం ఎక్కువగా రావడంతో మరో 100 మంది సిబ్బందిని పెంచామని.. హెలిప్యాడ్ వద్ద మొత్తం 250 మంది పోలీసులతో భద్రత కల్పించామని అన్నారు. అయితే, జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అవగానే.. వైసీపీ శ్రేణులంతా ఒక్కసారిగా ముందుకు తోసుకువచ్చారన్నారు. హెలిప్పయాడ్ దగ్గర కొంతమంది చాపర్ డోర్ లాగడంతో అది దెబ్బతిందని ఎస్పీ తెలిపారు. అంతే కానీ, అక్కడ ఎవరూ కూడా హెలికాప్టర్‌పై రాళ్లు, కర్రలు లాంటివి వేయలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పైలట్ కూడా కన్ఫామ్ చేశారని చెప్పారు. డోర్ డ్యామేజ్ కావడంతో హెలికాప్టర్ టేకాఫ్ చేయలేనని పైలట్ చెప్పారని.. అందుకే రోడ్డు మార్గంలో జగన్ తిరిగి వెళ్లారని ఎస్పీ అన్నారు.
కవ్వించారు.. సంయమనం పాటించాం..
జగన్ పర్యటనకు నిబంధనల మేరకు భారీ పోలీస్ బందోబస్తు కల్పించామని.. కొంతమంది కవ్వించినా తాము ఎక్కడా సంయమనం కోల్పోలేదని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. హెలికాప్టర్‌పై దాడి జరిగిందనే ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. జగన్ ల్యాండ్ అయి, తిరిగి వెళ్లిపోయే వరకు అందుబాటులో ఉన్న అన్ని వీడియో ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నామని చెప్పారు.
Also Read : జగన్ కామెంట్స్‌పై పరిటాల సీరియస్
జగన్ కామెంట్స్‌పై ఎస్పీ రియాక్షన్
ఇక, పోలీసులపై జగన్ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్‌పైనా ఎస్పీ రత్న స్పందించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల బట్టలు విప్పిస్తాం అని జగన్ అనడం సరికాదన్నారు. పోలీస్ యూనిఫాం ను తాము కష్టపడి సాధించామని.. ఎవరో తమకు ఇచ్చింది కాదన్నారు. ఒకవేళ పోలీసులు ఎవరైనా తప్పు చేసి ఉంటే.. సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు. తాము తమ డ్యూటీ మాత్రమే చేశామని. ఎవరికీ అనుకూలంగానో, వ్యతిరేకంగానో పని చేయలేదని చెప్పారు ఎస్పీ రత్న.