Threat to CM Chandrababu: సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో ఎందుకు మార్పులు చేశారు? మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి వుందా? భద్రతా వలయంలో కౌంటర్ యాక్షన్ బృందాలు దిగేశాయా? అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
మావోయిస్టుల నుంచి సీఎం చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో భద్రతను మరింత పెంచింది కేంద్రం. సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు చేరిపోయాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ప్రజలతో ఉండేందుకు ఇష్టపడుతున్నారు సీఎం చంద్రబాబు.
ఏ పథకం ప్రారంభించినా ప్రజల మధ్య చేస్తున్నారు. ఒకానొక దశలో తన సెక్యూరిటీని సైతం తగ్గించుకునే వాదన లేకపోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలకు టూర్ వెళ్లినప్పుడు కాన్వాయ్ వద్దకు ఎవరైనా వస్తే, వెంటనే ఆపి వారితో మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు భద్రతపై ఇంటెలిజెన్స్ ఎలాంటి రిపోర్టు కేంద్రానికి ఇచ్చిందో తెలీదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సెక్యూరిటీలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ టీమ్స్ వచ్చి చేరాయి. బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎస్ఎస్జీ సిబ్బందితోపాటు అదనంగా కౌంటర్ యాక్షన్ టీమ్ వచ్చి చేరాయి. సీఎం రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉండేలా ఆరుగురు కమాండోలు నిత్యం విధుల్లో ఉంటారు.
ALSO READ: నవశకానికి ‘నమో’దయం – విశాఖలో మోదీ పర్యటన
సీఎం చంద్రబాబు ఇకపై ముడంచెల భద్రతలో ఉండనున్నారు. తొలి అంచెల ఎన్ఎస్‌జీ, రెండో వలయంలో ఎస్ఎస్‌జీ, మూడో అంచెలో సాయుధ బలగాలు ఉంటాయి. వీరికి కొద్ది దూరంలో కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉండనున్నారు. ఈ కమాండోలు ప్రధాని భద్రత పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకున్నవారే. వీరికి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ సైతం ఉంటుంది.
2019-2024 మధ్య కాలంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండేవారు. ప్రజల్లోకి వెళ్లే సమయంలో దాడులు జరిగాయి. దీంతో ఎన్ఎస్‌జీ కమాండోల సంఖ్యను కేంద్రం పెంచింది. ఇంట్లో ఉన్న సమయంలో ఆరుగురు విధుల్లో ఉండేవారు. బయటకు వెళ్లే సమయంలో ఆ సంఖ్యను 12కి పెంచారు. నిత్యం కంటికి రెప్పలా సీఎం చంద్రబాబు వెంటనే ఆయా బలగాలు ఉండనున్నాయి.