Sri Reddy: అందరికీ సారీ మహాప్రభో.. నన్ను వదిలేయండి.. ఇక నేను ఏ తప్పుడు పోస్టులు పెట్టను.. ఇక నా జోలికి రావద్దు ప్లీజ్ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసి వైరల్ గా మారిన శ్రీరెడ్డి రెండు చేతులు జోడించి వేడుకున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈమె నోటిమాట వచ్చిందంటే చాలు అన్నీ బూతులేనంటారు టీడీపీ, జనసేన అభిమానులు. అసలు తన మాటలను తూటాలుగా వదులుతూ వైరల్ గా మారిన సినీనటి శ్రీరెడ్డి తెలియని వారుండరు. వైసీపీ జోలికి వచ్చినా, మాజీ సీఎం జగన్ ను ఒక్క మాట విమర్శించినా నేను రెడీ అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంలో ఎవరైనా శ్రీ రెడ్డి తరువాతే. అలాంటి శ్రీ రెడ్డి పలుమార్లు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా కూడా విమర్శించారు.
కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఉన్నట్లుండి అందరికీ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు శ్రీరెడ్డి. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే, సోషల్ మీడియా వేదికగా పలుమార్లు వైసీపీ పై సైతం శ్రీరెడ్డి విమర్శలు గుప్పించారు. తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా, తనకు గుర్తింపు లేదని మొన్న పార్టీలో చేరిన యాంకర్ శ్యామలకు పార్టీ కీలక పదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సోషల్ మీడియా వేదికగా వైసీపీని శ్రీరెడ్డి ప్రశ్నించారు. అప్పటి నుండి సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి ఒక్కసారిగా సారీ చెబుతూ వీడియో విడుదల చేయడం విశేషమే.
దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా ట్రోలింగ్ కు పాల్పడిన ప్రతి ఒక్కరిని ఏపీ పోలీసులు విడిచి పెట్టకుండా కేసులు నమోదు చేయడమేనని తెలుస్తోంది. మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా, పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తరుణంలో తనపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందంటూ, ముందే జాగ్రత్తగా శ్రీరెడ్డి వీడియో విడుదల చేసినట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు.
Also Read: Lady Aghori In Kurnool: అఘోరీ మాత కారు మొరాయింపు.. పాదయాత్రగా పయనం.. ఎక్కడికో తెలుసా?
అయితే గతంలో కర్నూలులో శ్రీరెడ్డి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం కూడా తెలిసిందే. మొత్తం మీద శ్రీరెడ్డి వీడియో ద్వారా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, నారా భువనేశ్వరి ఇలా ఒక్కొక్కరి పేరు చెబుతూ మన్నించాలని రెండు చేతులు జోడించారు. అంతేకాదు కార్యకర్తలందరినీ వదిలిపెట్టాలని, ఇకపై సోషల్ మీడియా వేదికగా తాను రాజకీయ విమర్శలు చేయడానికి నిలిపివేస్తున్నట్లు శ్రీరెడ్డి ప్రకటించారు. తన కుటుంబం, తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీరెడ్డి వీడియో విడుదల చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.