Lady Aghori In Kurnool: శ్రీకాళహస్తిలో హల్చల్ చేసిన అఘోరీ మాత, కర్నూల్ లో ప్రత్యక్షమయ్యారు. అయితే మరో మారు కారు మొరాయించగా, కాలినడకన యాగంటికి బయలు దేరారు. మీడియా ప్రతినిధులను మీరు మాత్రం ఏ ప్రశ్నలు అడగవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసి, యాగంటికి పాదయాత్ర చేపట్టారు అఘోరీ మాత.
తెలంగాణకు చెందిన అఘోరీ మాత, సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఆలయంలో పూజలు నిర్వహించి వార్తల్లోకెక్కారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా ఎన్నో ప్రకటనలు, ఇలా ఒకటి కాదు ఆమె నోటి నుండి వచ్చిన ప్రతి మాట వైరల్. కానీ తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నట్లు, తన మాటలను వక్రీకరించడం తగదని ఆమె తనపై వస్తున్న కామెంట్స్ పై స్పందించారు. అంతేకాదు తెలంగాణ నుండి వెళ్లిన అఘోరీ, తాను ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించి సంచలనం రేకెత్తించారు.
తన ఆత్మార్పణం కూడా ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద జరుగుతుందని ప్రకటించగా, భక్తులు అలర్ట్ కాగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. చివరికి వేములవాడ వద్ద అఘోరీని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆమె స్వగ్రామం కుశ్నపల్లికి తరలించారు. అక్కడ కొంతసేపు హడావుడి కూడా నెలకొంది. పోలీసులు ఆత్మార్పణం వద్దని కోరడం, అలాగే పెద్ద ఎత్తున భక్తులు గ్రామానికి చేరుకొని నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, ఏమి చెప్పినా వింటామని అఘోరీ మాతకు మాటిచ్చారు. దీనితో అఘోరీ కొంత వెనుకడుగు వేయగా, పోలీసులు ఆమెను కాన్వాయ్ తో రాష్ట్రం దాటించారు.
కార్తీక మాసం ప్రారంభమైన సమయం నుండి ఏపీలోని శైవక్షేత్రాలను అఘోరీ మాత దర్శిస్తున్నారు. అయితే శ్రీకాళహస్తి వద్ద వస్త్రధారణ పాటించలేదని, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ కు యత్నించారు అఘోరీ. పోలీసులు అప్రమత్తమై ఎట్టకేలకు నివారించి, సాయంత్రం దర్శనం చేయించారు. మరల శుక్రవారం తెల్లవారుజామున మాత కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదానికి కారణం పోలీసులేనంటూ అఘోరీ మాత ఆరోపించారు. ఇలా శ్రీకాళహస్తి వద్ద హల్చల్ చేసిన మాత, ఉన్నట్లుండి కర్నూల్ లో ప్రత్యక్షమయ్యారు.
అయితే కారులో యాగంటికి వెళ్తుండగా, కారు మొరాయించడంతో అఘోరీ మాత కారును అలంపూర్ వద్ద వదిలేసి కాలినడక సాగిస్తున్నారు. దీనితో స్థానికులు, భక్తులు ఈ విషయాన్ని తెలుసుకొని ఆమెను దర్శించేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అడుగడుగునా భక్తులు ఆశీర్వాదం తీసుకుంటూ, ఆమెతో పాటు కాలినడక సాగిస్తున్నారు. దీనితో దారి పొడవునా భక్తులు బారులు తీరగా, ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. కాలినడకన యాగంటికి వెళుతున్న అఘోరీ మాత వెంట భక్తులు కూడా అధిక సంఖ్యలో కాలినడక సాగిస్తుండగా, ఇరువైపులా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడగా, భక్తులే వాహనాలను క్రమబద్దీకరిస్తున్నారట.
Also Read: Lady Aghori: కారు ప్రమాదానికి కారకులు వారే.. శాపనార్థాలు పెట్టిన అఘోరీమాత.. అసలేం చెప్పారంటే?
తాను యాగంటి క్షేత్రానికి వెళుతున్నట్లు, కారు మరమ్మతులకు గురైందని మాత తెలిపారు. అయితే అఘోరీ మాత కాలినడకన యాగంటికీ వెళుతున్న సందర్భంగా, విషయాన్ని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు మాట్లాడాలని అడగగా, నిరాకరించినట్లు సమాచారం. మొత్తం మీద అఘోరీ మాత శ్రీకాళహస్తి దర్శనం అనంతరం యాగంటి క్షేత్రాన్ని దర్శించుకోనున్నారు.