Narasampalli Repoll: శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నరసంపల్లి గ్రామ పంచాయతీ 7వ వార్డులోని పోలింగ్ కేంద్రం నంబర్-7లో పోలింగ్‌ను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ. శ్యామ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో బ్యాలెట్ బాక్సుల్లోకి ఇద్దరు వ్యక్తులు ఇంకు పోసారు. దీంతో నవంబర్ 27వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నరసంపల్లి గ్రామ పంచాయతీ 7వ వార్డు పోలింగ్ కేంద్రం నంబర్-7లో రీపోల్ నిర్వహించనున్నారు.
రీపోల్ పూర్తయ్యే వరకు నరసంపల్లి గ్రామ పంచాయతీలోని ఇతర పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు చేపట్టరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇతర పోలింగ్ కేంద్రాల బ్యాలెట్ బాక్సులను భద్రతతో ప్రత్యేక గదిలో ఉంచి, తాళం వేసి సీల్ చేయడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులు సూచనలు చేశారు. పోటీ చేసిన అభ్యర్థులు తమ ఏజెంట్ల ద్వారా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అవకాశం కల్పించే అవకాశం ఉంది.
రీపోల్ పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించడంతో పాటు ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నట్లు ఉత్తర్వులలో పేర్కోన్నారు. రీపోల్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేసారు.
Also Read: ఎమ్మెల్యే కూతురి పెళ్లిలో కరెన్సీ నోట్ల వర్షం.. చీపురుతో ఊడుస్తున్న దృశ్యాలు వైరల్!