Sri Satya Sai district News : అప్పుడే కళ్లు తెలిచిన శిశువు, రక్తపు ముద్దగా ఉన్న శరీరం.. తల్లి పొత్తిళ్లల్లోకి చేరుకుని సేదతీరాల్సిన సమయం. కానీ.. ఆ పసి వాడి పుట్టుకే పుట్టెడు కష్టాలతో మొదలైంది. మెత్తడి పాన్పు ఎక్కాల్సిన వాడు.. ముళ్ల పొదల్లోకి చేరాడు. పుట్టీపుట్టగానే అనాథగా మారిపోయాడు. స్థానికులు చూడడం కాస్త ఆలస్యం అయి ఉంటే.. కుక్కలకు ఆహారంగా మారిపోయే వాడు. కానీ.. చివర్లో కాస్త కాలం కనికరించింది. పని దేహాన్ని ముక్కలుగా చీల్చేందుకు వీధి కుక్కలన్ని ఏకం కాగా, ఓ వృద్ధురాలి స్పందనతో బతికి బయటపడ్డాడు.
శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మానవత్వం మరిచారో, సమాజ కట్టుబాట్లు దాటేశామనే ఆందోళనో కానీ.. కడుపున పుట్టిన పసిబిడ్డను రోడ్డు పాలు చేశారు. ఏ తప్పుడు పని చేసి సిగ్గుపడ్డారో తెలియదు కానీ చిన్నారిని ప్లాస్టిక్ కవర్లో చుట్టి ముళ్ల పొదళ్లోకి విసిరేశారు. జిల్లాలోని బత్తులపల్లిలోన మారుతీ నగర్ లో చోటుచేసుకుంది. అక్కడి స్థానిక బీసీ గురుకల పాఠశాల వెనుక అంగన్వాడీ కేంద్రం ఉంది. దాని పక్కనే ఖాళీ స్థలంలోని ముళ్ల పొదల దగ్గర ఫిబ్రవరి 12న ఉదయం కుక్కలన్నీ పోగైయ్యాయి. వాటికి ఏదో నీచు వాసన రావడంతో..అవన్నీ అక్కడి పొదల నుంచి ఓ ప్లాస్టిక్ కవర్ ను బయటకు లాగుతున్నాయి. అదే సమయంలో అక్కడ చెత్త ఊడుస్తున్న ఓ వృద్ధురాలికి ఆ దృశ్యం కనిపింది. ఆమెకు ఎందుకో అనుమానం వచ్చి.. కుక్కల్ని అక్కడి నుంచి తరిమేసింది.
కుక్కలు రోడ్డు మీదకు లాకొచ్చిన ప్లాస్టిక్ కవర్ ను పట్టుకుని చూసిన వృద్ధురాలికి.. చాలా బరువుగా అనిపించింది. దాంతో.. ఏంటో తెలుసుకునేందుకు కవర్లు విప్పి చూడగా, ఓ నవజాత శిశువు కనిపించింది. దాంతో.. ఆమె స్థానికులకు సమాచారం అందిచడంతో వారంతా వచ్చి.. చిన్నారి బిడ్డను పరిశీలించారు. మగ శిశువుగా గుర్తించిన స్థానికులు.. వెంటనే ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. శిశువును పరిశీలించిన వైద్యులు.. నార్మల్ డెలివరీ అయినట్లుగా గుర్తించారు. శిశువుపై ఇంకా మాయ కూడా పోలేదని, తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత ఉండే పొర, రక్తం అలాగే ఉన్నట్లు తెలిపారు. శిశువును పూర్తిగా శుభ్రం చేసిన వైద్యులు. బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ఆసుపత్రిలో ప్రాణం పోసుకున్న శిశువు కాదని గుర్తించిన వైద్యులు.. ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండడంతో పీపీఆర్ చేసి వెంటిలేటర్ అమర్చారు. శిశువు ఒంటరిగా ముళ్లపొదల్లో లభించిన విషయాన్ని ఐసీడీఎస్ సూపర్ వైజర్ చంద్రమ్మ దృష్టికి తీసుకెళ్లారు. ఆ శిశువును తాము పెంచుకుంటామంటూ ఓ దంపతులు ముందుకు వచ్చారు. పభుత్వం నిబంధనలు పూర్తి చేసి వారికి బిడ్డను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : జగన్‌ని ‘మద్యం’ మింగిస్తోందా.. సీబీఐ, ఈడీ దిగడం ఖాయమా?
సాధారణంగా ఆడపిల్లలు పుట్టినప్పుడు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుంటారు. కానీ.. మగ పిల్లాడిని తుప్పల్లో పడేయడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరో.. పెళ్లికాకుండానే గర్భవతి కావడంతో, రహస్యంగా బిడ్డను కని, రోడ్డుపై పడేసి ఉంటారని భావిస్తున్నారు. సమాజానికి, కుటుంబానికి భయపడి పిల్లాడిని కవర్లో చుట్టు తుప్పల్లో పడేసి ఉంటారని అనుకుంటున్నారు.