Srisailam Temple: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను 19వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్నారు. 19న ధ్వజారోహణ, 20న భృంగి వాహన సేవ, 21న హంస వాహన సేవ, 22న మయూర వాహన సేవ, 23న రావణ వాహన సేవ, 24న పుష్ప పల్లకి సేవ, 25న గజ వాహన సేవ, 26న మహాశివరాత్రి, నంది వాహన సేవ, 27న రథోత్సవం, తెప్పోత్సవం, 28న యాగపూర్ణాహుతి, మార్చి ఒకటో తేదీన అశ్వవాహన సేవ, పుష్పోత్సవం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే 23వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం సాగుతుందని శ్రీశైల ఆలయ అధికారులు ప్రకటించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో చలువ పందిర్లను ఏర్పాటు చేశారు. కాగా 19వ తేదీ నుండి మార్చి ఒకటో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు నిలిపివేశారు. ఈ ఉత్సవ రోజులలో భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతుందని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని అధికారులు కోరారు.
భక్తుల సౌకర్యార్థం మూడు క్యూ లైన్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శీఘ్ర దర్శనం రూ. 200 లు, అతి శీఘ్ర దర్శనంకు రూ. 500 లు భక్తులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే శివదీక్ష భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం 35 లక్షల లడ్డు ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఆలయ అధికారులు ప్రణాళిక రూపొందించారు. మొత్తం 15 శాశ్వత కౌంటర్ల ద్వారా లడ్డు ప్రసాదాలను భక్తులకు అందజేయనున్నారు. 4 రోజులపాటు అనగా 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదాలను అందజేస్తారు. ఒక్కో భక్తుడికి ఒక లడ్డును ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని మీడియా సమావేశంలో అధికారులు ప్రకటించారు.
అలాగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు, మొత్తం 10 బస్సులు భక్తులకు ఉచిత సేవలు అందిస్తాయన్నారు. పాతాళ గంగ వద్ద భక్తులు పుణ్యా స్నానాలు ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఆలయ సమీపంలో గంగాభవాని స్నాన ఘట్టాలలో కూడా భక్తులు స్నానాలను ఆచరించవచ్చు. అంతేకాకుండా మొత్తం 12చోట్ల భక్తులు స్నానాలు ఆచరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు నిరంతరం సేవలు అందించేందుకు అన్నదాన భవన సముదాయం వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ లో కంట్రోలింగ్ పాయింట్ ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ లో 21 ఎల్ఈడి టీవీలు అందుబాటులో ఉంటాయని, అలాగే 553 స్టాటిక్ సీసీ కెమెరాలు నిరంతరం భక్తుల రద్దీని పర్యవేక్షిస్తాయని తెలిపారు.
Also Read: Fine for Drinking Water: నీటిని వృథా చేస్తున్నారా? ఏకంగా రూ. 5 వేలు ఫైన్ కట్టాల్సిందే..
ఉత్సవాల సందర్భంగా భక్తులకు సమాచారాన్ని తెలిపేందుకు రెండువేల సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందని, పాదయాత్ర ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు సూచిక బోర్డులు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు ప్రకటించారు. మొత్తం మీద శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.