Fine for Drinking Water: నీటిని వృథా చేయరాదు. ప్రతి నీటి బొట్టు విలువైనది. ఇలాంటి వాక్యాలు మనకు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. వేసవి కాలం వచ్చింది. ప్రతి ఒక్కరూ ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాల్సిన కాలమిది. నీటిని వృథా చేస్తే, వచ్చే నీటి ఇబ్బందులను ఎదుర్కోవడం కష్టమే. అందుకే తాగునీటిని వృథా చేస్తే, జరిమానా విధించే స్థాయికి ప్రస్తుత పరిస్థితులు చేరాయి. అందుకే నీటిని వృథా చేయవద్దు.. జరిమానాలు చెల్లించవద్దు.
అసలే ఎండాకాలం రానే వస్తోంది. ఇప్పటికే భానుడి భగభగల జోరు సాగుతోంది. ఉదయం 8 గంటలకే సూర్యుడి ప్రతాపం చూపుతున్న పరిస్థితి. ఎండల ధాటికి బోరు బావులు, నీటి కుంటలు జలకళను కోల్పోతున్నాయి. ఇలా ఎండల ప్రభావం ఇప్పుడే ఇలా ఉంటే. మున్ముందు మాత్రం వేడిగాలులను తట్టుకోవడం కష్టమే అంటున్నారు ప్రజలు. అయితే మండే ఎండల నుండి ఉపశమనం పొందాలంటే, తప్పక నీటిని త్రాగాల్సిందే అంటున్నారు వైద్యులు. రోజుకు ప్రతి వ్యక్తి రెండు లీటర్లకు పైగానే నీటిని తాగాలని సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నీటి వృథాను అరికట్టాల్సిన పరిస్థితి ఉంది.
మనకు తాగు నీటితో పాటు ఇతర అవసరాలకు కూడా నీరు అవసరం. అందుకే నీటి పొదుపు పాటించకపోతే, రానున్న ఎండా కాలంలో తిప్పలు తప్పవు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టినప్పుడే, మనకు నీటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని పర్యావరణవేత్తలు తెలుపుతున్నారు. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా నీటి పొదుపు పాటించాల్సిన అవసరం ఉందట. చాలా వరకు వాహనాల శుభ్రత, ఇంటిని ఒకటికి పది సార్లు నీటితో శుభ్రం చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇంటి పరిశుభ్రత పాటించడం మంచిదే కానీ, అలాగే నీటి పొదుపు కూడా పాటించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.
ఇలాంటి వాటిని అదుపు చేసేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. కార్ల వాషింగ్, గార్డెనింగ్, ఫౌంటేన్లు, మాల్స్, సినిమా హాళ్లలో మంచినీరు వాడొద్దని కూడా ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ రాష్ట్రంలోని ఓ నగరంలో గల 14000 బోర్లలో సగం ఎండిపోవడంతో నీటి కొరత ఏర్పడిందట. మున్ముందు నగరవాసులు తీవ్ర తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో, ముందస్తు చర్యగా ఈ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది.
ఎవరైనా తాగునీరు వృథా చేస్తే ఏకంగా రూ. 5 వేలు జరిమానా వేస్తామని ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. దీనికోసం ఆ నగరంలో నిరంతరం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారని, నీటిని వృథా చేస్తే తప్పక జరిమానా చెల్లించాల్సిందేనని అధికారులు హెచ్చరించారు. మొత్తం మీద అధికారులు తీసుకున్న నిర్ణయంతో నగరవాసులు భిన్నస్వరం వినిపిస్తున్నారు.
Also Read: బర్డ్ ఫ్లూ కాదు.. ఈ కోడి అలా మారడం వెనుక పెద్ద కథే ఉంది!
ఈ నిర్ణయం సబబేనంటూ కొందరు అంటుండగా, మరికొందరు ఇదెక్కడి గోలరా నాయన అంటూ నిట్టూరుస్తున్నారు. ఇంతకు నీటిని వృథా చేస్తే జరిమానా విధించే పరిస్థితి ఎక్కడ ఉందంటే.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో. మన తెలుగువారు బెంగుళూరు నగరంలో ఉంటే వెంటనే ఈ సమాచారం ఇవ్వండి. లేకుంటే జరిమానా తప్పనిసరి. ఏదిఏమైనా జరిమానా కంటే భావితరాల కోసం అందరూ నీటి పొదుపు మంత్రం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.