Srisailam Hundi Income: శ్రీశైల మల్లన్న దేవస్థానం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ అధికారులు, ఆదాయాన్ని చూసి నివ్వెరపోయారు. కేవలం 16 రోజుల్లో రికార్డు స్థాయి ఆదాయం రావడంతో మల్లన్న భక్తులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇండియా కరెన్సీ నే కాకుండా, ఇతర దేశాల కరెన్సీ కూడా హుండీల లెక్కింపు సమయంలో బయటపడడంతో అధికారులు విస్మయం చెందారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం వద్ద మహాశివరాత్రి మహోత్సవాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మహోత్సవాలు హాజరైన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలినడకన వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. రోజుకొక వాహనంపై స్వాముల వారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ మహోత్సవాలకు హాజరైన భక్తుల కోసం ఉచితంగా పది బస్సులు సేవలు అందించగా, మూడు రోజులపాటు భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదాలను సైతం ఆలయ అధికారులు అందజేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు రాగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. మహాశివరాత్రి పర్వదినం రోజున అత్యధికంగా 1,05,906 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.
భక్తుల రాకపోకలకు ఏ ఆటంకం కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. 11 రోజుల పాటు జరిగిన మహా శివరాత్రి ఉత్సవాలలో కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, ఇతర రాష్ట్రాల భక్తులు సైతం తరలివచ్చి మల్లన్నను దర్శించుకున్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సంధర్భంగా శ్రీశైల శైవక్షేత్రం శివనామస్మరణతో మారుమ్రోగింది. ఆలయ అధికారులు కల్పించిన సౌకర్యాలపై భక్తులు సైతం అభినందనలు తెలిపారు.
మహాశివరాత్రి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ అధికారులు బుధవారం లెక్కించారు. ఫిబ్రవరి 17వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు ఉండి ఆదాయాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కించి ఆలయ అధికారులు పూర్తి వివరాలను ప్రకటించారు. కేవలం 16 రోజుల కాలంలో రూ. 5,69,55,455 ల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ నగదు తో పాటు 87 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 5 కేజీల 850 గ్రాముల వెండి కానుకల రూపంలో భక్తులు సమర్పించారు.’
Also Read: AP Mid Day Meal: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై వద్దన్నా.. బడిలో భోజనం తినేస్తారు
అలాగే విదేశీ కరెన్సీ సైతం హుండీ లెక్కింపులో లభించినట్లు అధికారులు ప్రకటించారు. యూఎస్ఏ డాలర్లు 885, యూఏఈ దిర్హమ్స్ 105, యూకే సౌండ్స్ 80, సింగపూర్ డాలర్లు 2, కెనడా డాలర్లు 5 మొదలైన విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద 16 రోజులకు కోట్లల్లో ఆలయానికి ఆదాయం రాగా అధికారులు హర్షం వ్యక్తం చేశారు.