Big Stories

Pawan : ఏలూరులో టెన్షన్.. హరిరామజోగయ్యకు పవన్ ఫోన్.. చింతమనేని అరెస్ట్..

Pawan : కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి హరిరామజోగయ్య చేపట్టిన దీక్ష ఏపీలో ఉద్రికత్తలను పెంచుతోంది. ఏలూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే హరిరామజోగయ్యకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఫోన్‌ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం 85 ఏళ్ల వయసులో జోగయ్య దీక్ష చేస్తున్నారని.. ఆయన ఆమరణ దీక్షపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్‌ చేశారు. హరిరామజోగయ్య ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉందన్నారు. ఆయనతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని జనసేనాని డిమాండ్ చేశారు.

- Advertisement -

హరిరామజోగయ్యను పరామర్శించేందుకు ఏలూరు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. దీంతో ఆస్పత్రి వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరిరామజోగయ్యను పరామర్శించేందుకు వచ్చిన కాపు సంక్షేమ సమితి నేత ఆదిశేషును పోలీసులు అదుపులోకి తీసుకుని త్రీటౌన్‌ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

కాపు రిజర్వేషన్ల కోసం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన నివాసం వద్దే ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం సమయానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లే రహదారులపై బారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. బందరు, కాకినాడ అడిషనల్‌ ఎస్పీలు ఎన్‌వీ రామాంజనేయులు, శ్రీనివాస్‌, నరసాపురం డీఎస్పీ మనోహరాచారి జోగయ్యతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రిజర్వేషన్లపై జీవో విడుదల చేసేలా ప్రయత్నించాలని జోగయ్య పోలీసులకు సూచించారు. ఈ సమయంలో ఆయన నివాసంలోకి మీడియాను అనుమతించలేదు. రాత్రి పదిన్నర తర్వాత 400 మంది పోలీసులు భద్రత మధ్య జోగయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆయన కూర్చున్న కుర్చీతోపాటు అంబులెన్స్‌లోకి తరలించారు. అక్కడ నుంచి ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

హరిరామజోగయ్య ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. తనకేమైనా జరిగితే సీఎం జగన్‌, పోలీసు అధికారులే కారణమంటూ తనను అదుపులోకి తీసుకోవడానికి ముందు హరిరామజోగయ్య వీడియోను విడుదల చేశారు. మరోవైవు ఏలూరు ఆస్పత్రి వద్ద జనసేన, టీడీపీ నేతలు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జోగయ్య ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News