ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నేతలకు ముప్పు పొంచివుందా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. తాజాగా సీఎం జగన్ లండన్ టూర్ వెళ్లారు. పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టు వెళ్లారు.
ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టులో ఉండగానే అనుమానాస్పదంగా తిరిగాడు ఓ వ్యక్తి. పోలీసులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను అమెరికాకు చెందిన డాక్టర్ తుల్లూరు లోకేష్‌గా గుర్తించారు. ఆయనకు అమెరికన్ సిటిజన్ షిప్ ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఫారెన్ టూర్‌పై ముందుగానే ఆ డాక్టర్ కొన్ని మెసేజ్‌లు ఇతరులకు పంపించనట్టు గుర్తించారు పోలీసులు. విచారణ సమయంలో గుండెపోటు రావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.
ఏపీలో ఎన్నికలు ముగియడంతో న్యాయస్థానం అనుమతితో సీఎం జగన్ లండన్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. అక్కడ సీఎం జగన్‌కు పార్టీ నేతలు జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొట్టు సత్యనారాయణ వంటి నేతలు సెండాఫ్ ఇచ్చారు. మళ్లీ మే 31న సీఎం జగన్ ఏపీకి తిరిగి రానున్నారు.
ALSO READ: కారును ఢీ కొట్టిన లారీ.. నలుగురు స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కీలక నాయకులను అల్లరిమూకలు టార్గెట్‌గా చేసుకున్నట్లు వార్తలు లేకపోలేదు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముప్పు పొంచివుందన్న నేపథ్యంలో కేంద్రం భద్రతను పెంచింది. ఇప్పుడున్న 12 బదులు 24 మంది బ్లాక్ కమెండోలను కేటాయించింది. రెండు షిప్టుల్లో వీరంతా పని చేయనున్నారు. ఈ సమయంలో ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి తిరగడం కలకలం రేపుతోంది. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.