Health Insurance In AP : ఆపదలో ఆర్థికంగా ఆదుకునే బీమా కవరేజిని రాష్ట్రంలోని చాలా మందికి లేదు. అనుకోకుండా వచ్చిపడే ఆర్థిక విపత్తుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, ఆ ఆపద నుంచి గట్టెక్కించే బీమా పాలసీల గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే.. ఏపీ ప్రభుత్వం సరికొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల మేర బీమా కవరేజీని అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తులు చేస్తుండగా.. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే.. ఇది తమ ఆలోచన అంటే తమదంటూ టీడీపీ, జనసేనా పార్టీ శ్రేణులు ఈ పథకం క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలకు సైతం వెనుకాడడం లేదు.
ప్రతీ కుటంబానికి ఏవైనా అనారోగ్యాలకు గురైనా, విపత్తులు వచ్చి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించినా.. ఈ కవరేజీ ద్వారా సురక్షితంగా బయటపడొచ్చు. ఇది అమల్లోకి వస్తే భారత రాజకీయ చరిత్రలో ఒక విప్లవాత్మక పథకం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. దీన్నో అద్భుత ఆలోచన అని, ప్రగతిశీల ఆలోచన అంటూ మీడియా, సోషల్ మీడియా ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే.. పథకం బాగానే ఉంది, ప్రయోజనాలు కూడా బాగానే ఉన్నాయి కానీ, దాని క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అన్నదే అసలు సమస్యగా మారింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రెండు ప్రధాన పార్టీలకు నేతృత్వం వహిస్తుండడం, ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నేపథ్యంలో.. ఈ పథకం క్రెడిట్ ఎవరికి దక్కాలనే ప్రశ్న తలెత్తుతోంది.
జనసేనా వాదనేంటి
ఈ పథకాన్ని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారనే వార్తల నేపథ్యంలో జనసేనా పార్టీ నాయకులు సంతోషంగా లేరు. ఈ పథకం గురించి తొలుత తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచించారని, ఆయనే దీనికి రూపకర్త అని చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేస్తే.. ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కాలని జనసైనికులు కోరుతున్నారు. కూటమిగా పోటీ చేయడానికి ముందు నాటి 2019 ఎన్నికల్లో జనసేనా మ్యానిఫెస్టోలో ఇదే విషయాల్ని స్పష్టంగా తెలిపామంటూ చెబుతున్నారు. అప్పటి నుంచి ఆయన అందరికీ బీమా సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్య సహాయం అందజేయాలని బలంగా ప్రయత్నిస్తున్నారంటూ చెబుతున్నారు.
టీడీపీ నాయకులేమంటున్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలో టీడీపీ అతిపెద్ద భాగస్వామి, చంద్రబాబు కూటమి రథసారధిగా పని చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు, ఎలాంటి ఆలోచనలు చేసినా.. దానిని అమలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబుదే అన్న సంగతి మర్చిపోవద్దని అంటున్నారు. ఏ పథకమైనా సీఎం అనుమతి, అమోదం లేకుండా అమలు కాలేదని.. అందుకే ఆ పథకం పూర్తి క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూటమి భాగస్వామి కానీ, ఆయనే ముఖ్యమంత్రి కాదని.. సీఎంను మించి ఏ పథకం క్రెడిట్ అయినా ఆయనకు ఎలా దక్కుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఆరోగ్య శ్రీ క్రెడిట్ ఎవరికి దక్కింది
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ గుర్తిండిపోయో పథకం అంటే ఆరోగ్య శ్రీ.. ప్రతీ పేద కుటుంబానికి రూ.2 లక్షల మేర ఆరోగ్య భరోసాను కల్పించారు. దాంతో.. చిన్నచిన్న ఆపరేషన్ల నుంచి పెద్ద శస్త్ర చికిత్సల వరకు పేదలు కార్పొరేట్లో వైద్యాన్ని పొందారని గుర్తు చేసుకుంటున్నారు. ఈ పథకాన్ని మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 2007లో ప్రవేశపెట్టింది. కానీ.. ఇప్పటి లాగానే అప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ, టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్), కమ్యూనిస్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేసి గెలుపొందాయి. రాష్ట్రంలోనే కాక, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం టీఆర్ఎస్ పార్టీ భాగస్వామిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం జనసేనా నేతలు చెబుతున్నట్లు.. ఆ పథకం క్రెడిట్ అంటా బీఆర్ఎస్, కమ్యూనిష్ట్ పార్టీలకు దక్కాలి. కానీ.. ఇప్పటికైనా, ఎప్పటికైనా ఆరోగ్యశ్రీ అంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరునే చెబుతుంటారు.
జనసేనా నాయకులు చెబుతున్నట్లుగా రాష్ట్రంలోని ప్రజలకు యూనివర్సల్ ఇన్సూరెన్స్ ఆలోచనను మొదట పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినట్లైతే.. ఆ క్రెడిట్ అతనికి లభిస్తుంది, కానీ పథకం మాత్రం చంద్రబాబు పేరుపైనే ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి ప్రజోపయోగ, దీర్ఘకాలం ప్రజల మన్ననలు అందుకునే పథకాలను.. తర్వాత వచ్చే ప్రభుత్వాలు సైతం కొనసాగించాల్సి ఉంటుంది. దాంతో.. ఈ పథకం క్రెడిట్ అంతా.. చంద్రబాబు ఖాతాలోకే వెళుతుంది అంటున్నారు.