Janasena : ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో తొలుత పొత్తుకు పవన్ సంకేతాలు అందించారు. ఆ తర్వాత కొన్నిరోజులకు జనసేనాని విశాఖ పర్యటనను పోలీసులు అడ్డుకోవడం.. ఈ ఘటనపై పవన్ కు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. విజయవాడ నోవాటెల్ హోటల్‌కు వెళ్లి పవన్ ను చంద్రబాబు కలుసుకున్నారు. ఇలా పొత్తుకు తొలి అడుగులు పడ్డాయి.
ఆ తర్వాత కొన్నాళ్లుకు చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించడాన్ని పవన్ తప్పుపట్టారు. టీడీపీ అధినేతకు సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిశారు. ఇప్పుడు తాజాగా ముచ్చటగా మూడోసారి చంద్రబాబు, పవన్ భేటీకావడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై దాదాపు గంటకుపైగా ఇరువురు నేతలు ఏకాంతంగా చర్చించారు.
చంద్రబాబు, పవన్ తాజా భేటీ అంజెడాను జనసేన నేత నాదెండ్ల మనోహర్ రివీల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు చర్చలు జరిగాయని క్లారిటీ ఇచ్చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని చర్చలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల కోసమే జనసేనాని ఆలోచిస్తున్నారని చెప్పారు. పదవులు, సీట్ల కోసం పవన్ ఆరాటపడటం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందు మంచి ఆల్టర్ నేటివ్ ఉంచాలనుకుంటున్నామన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది జనసేన నినాదం అని స్పష్టంచేశారు. సీఎం జగన్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. మనోహర్ ఇచ్చిన క్లారిటీతో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని తేలిపోయింది. ఇక తేలాల్సిందని సీట్లు లెక్కలే.
మరోవైపు జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. చంద్రబాబు, జనసేనాని విజయవాడలో భేటీ తర్వాత .. విశాఖలో ప్రధాని మోదీతో పవన్ భేటీ కావడం ఆసక్తిని రేపింది. ఈ మధ్యే ఢిల్లీ వెళ్లి పవన్ బీజేపీ అగ్రనేతలను కలిసి వచ్చారు. కానీ రాష్ట్ర నేతలతో మాత్రం సరైన సయోధ్యలేదు.
పవన్ మాత్రం టీడీపీని కలుపుకోవాలనుకుంటున్నారు. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారు. మరి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే కాషాయ పార్టీ ఈ కూటమిలో కలుస్తుందా..? లేదా ఒంటరిగానే పోటీ చేస్తుందా..? అసలు బీజేపీ దారెటు..?