Chandrababu Kuppam Tour: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు. కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పారు. ఆలయంలో అమ్మవారికి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలు అందించారు.
అమ్మవారి దర్శనం తర్వాత మహిళలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. తన హయాంలో మహిళాభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అప్పట్లో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు. డ్వాక్రా సంఘాలతో మహిళల జీవితాలను మార్చేశానన్నారు. ఆర్టీసీలోనూ మహిళలకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. మహిళల ద్వారా కుటుంబ ఆదాయం పెంచే ప్రయత్నం చేశామన్నారు.
మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. మహిళల జోలికి ఎవరైనా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: సుగుణమ్మ కంటతడి, ఒక్కసారి ఆలోచించండి?
మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటన వేళ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. కుప్పంలోని టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు బస చేసిన వాహనాన్ని టీడీపీ శ్రేణులు చుట్టుముట్టాయి. ఆ సమయంలో పోలీసులు ఎక్కువ మంది అక్కడ విధుల్లో లేరు. అందువల్లే కార్యకర్తలు అందరూ ఆ వాహనం వద్దకు వచ్చేశారు. చంద్రబాబు మహిళలతో ముఖాముఖి కార్యక్రమం కోసం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. టీడీపీ అధినేతకు సాధారణ భద్రతను మాత్రమే కల్పించడంపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.