ఎన్నికల సమయంలో, ఆ తర్వాత వైసీపీ నుంచి టీడీపీవైపు వచ్చినవారి విషయంలో అధిష్టానం పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. ఏమాత్రం తేడా వచ్చినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నవారయినా వారిని పక్కనపెట్టేందుకు సిద్ధపడుతోంది. తాజాగా నెల్లూరు నగర మేయర్ స్రవంతికి ఇలానే పదవీగండం ఏర్పడింది. ఇటీవల ఆమె మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డితో భేటీ కావడం సంచలనంగా మారింది. దీంతో టీడీపీ అధిష్టానం ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఫిక్స్ అయింది.
ఎవరీ స్రవంతి..?
పొట్లూరి స్రవంతికి రాజకీయ నేపథ్యం లేదు, అయితే ఆమె భర్త పొట్లూరి జయవర్దన్ స్టూడెంట్ లీడర్ గా ఎదిగి, వైసీపీలో చురుకైన కార్యకర్తగా ఉన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరుడిగా పేరుంది. 2019 ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన ఆయన కుటుంబానికి అనుకోని అదృష్టం వరించింది. నెల్లూరు మేయర్ పీఠం ఎస్టీ జనరల్ విభాగానికి రిజర్వ్ కావడంతో స్రవంతితో నామినేషన్ వేయించి కార్పొరేటర్ గా ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు. దీంతో అప్పటి వరకు గృహిణిగా ఉన్న స్రవంతి నెల్లూరు మేయర్ గా, ప్రథమ పౌరురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు..
2024 ఎన్నికలకు ముందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడారు. ఆ సమయంలో మేయర్ పొట్లూరి స్రవంతి కూడా ఆయన వెంట నడిచారు. కానీ వైసీపీ మాత్రం ఆమెపై ఒత్తిడి తెచ్చింది. ఏడాదిన్నర కాలం అధికారం ఉండగా, తొందరపడి రూరల్ ఎమ్మెల్యే వెంట నడవడం సరికాదని నచ్చజెప్పారు నేతలు. దీంతో ఆమె తిరిగి వైసీపీ గూటికి చేరారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఆమె తటస్థంగా ఉండిపోయారు. అయితే ఎన్నికల తర్వాత కథ మరో మలుపు తిరిగింది. కార్పొరేషన్ లో మేయర్ భర్త జయవర్దన్ చేతివాటం, ఫోర్జరీ సంతకాల వ్యవహారం సంచలనంగా మారింది. జయవర్దన్ జైలుకి కూడా వెళ్లొచ్చారు. అప్పట్నుంచి వారిద్దరు వైసీపీకి మళ్లీ దూరం పాటించారు. అధికార కూటమి సానుభూతికోసం ప్రయత్నించసాగారు. మేయర్ గా ప్రభుత్వానికి సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు స్రవంతి.
కాకాణి రీఎంట్రీ..
కాకాణి గోవర్దన్ రెడ్డి ఇటీవల జైలునుంచి బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీలో పాత నేతలందర్నీ ఆయన తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగర మేయర్ కుటుంబాన్ని కూడా ఆఫీస్ కి పిలిపించుకుని మాట్లాడారు. ఈ భేటీతో రాజకీయ రచ్చ మొదలైంది. మేయర్ స్రవంతిపై అవిశ్వాతం పెట్టాల్సిందేనని టీడీపీ నిర్ణయించింది. నెల్లూరు కార్పొరేషన్ పాలక వర్గం ఏర్పడి ఈ నవంబర్ నాటికి నాలుగేళ్లు పూర్తవుతాయి. దీంతో నగర మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు టీడీపీ ముఖ్య నేతలు నిర్ణయించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణ ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండగా.. గతంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకే అన్నీ దక్కాయి. ఆ తర్వాత చాలామంది పార్టీ మారారు. వైసీపీ మెజార్టీ తగ్గిపోయింది. ఇప్పుడు అవిశ్వాసంతో అసలు ఎవరి బలం ఎంతో తేలిపోతుంది. నవంబర్ చివరివారం లేదా డిసెంబర్లో అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడానికి టీడీపీ సిద్ధమైంది. దీంతో మేయర్ స్రవంతికి పదవీగండం ఖాయమని తేలిపోయింది.