Phone Limits: ఫోన్ మన జీవితంలో చాలా అవసరం అయినప్పటికీ, అది వ్యసనంగా మారితే పరిస్థితి భిన్నంగా మారుతుంది. గంటల తరబడి ఫోన్ వాడడం వల్ల సమయం వృథా అవుతుంది. చదువు, పని, వ్యక్తిగత జీవితం ప్రభావితం అవుతుంది. కళ్లకు, నిద్ర, శారీరక, మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. సామాజిక జీవనం, కుటుంబ సంబంధాలు కూడా దూరమవుతాయి. ఇలాంటి వ్యసనాన్ని ఎదుర్కోవడానికి, జపాన్‌లోని టయోకే పట్టణం ప్రతిరోజూ రెండు గంటలపాటు మాత్రమే ఫోన్ వాడాలని సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది.
విద్యార్థులకు వ్యసనంగా మారిన స్మార్ట్ ఫోన్
జపాన్ లోని ఐచీ అనే రాష్ట్రంలో ఉన్న టయోకే చిన్న పట్టణం. అందులో దాదాపు 69 వేలమంది జనాభా మాత్రమే కలిగి ఉంది. ఫోన్‌కు యువత బానిసగా మారుతుందనే ఆలోచనతో ప్రతిరోజూ రెండు గంటలపాటు మాత్రమే ఫోన్ వాడాలనే ఈ కొత్త ఆలోచన తీసుకువచ్చింది. దీని వెనుక ప్రధాన కారణం అక్కడి యువతలో పెరుగుతున్న అలవాట్లు. విద్యార్థులు పుస్తకాలతో గడపాల్సిన సమయాన్ని గంటల తరబడి ఫోన్‌కు కేటాయిస్తున్నారు. పెద్దలు కూడా ఉద్యోగ సంబంధ పనుల కంటే ఎక్కువ సమయాన్ని ఇన్‌టర్నెట్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. దీనిని గమనించిన స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు చివరికి ప్రజల మేలు కోసం ఒక పరిష్కారం కనుగొనాలని భావించారు. అదే స్మార్ట్ సమయాన్ని 2 గంటలకు మాత్రమే పరిమితం చేయడం.
Also Read: Bigg Boss 9 telugu: హమ్మయ్య.. ఎట్టకేలకు ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసింది!
ఇది ఎలాంటి చట్టబద్ధమైన ఆంక్ష కాదని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. బలవంతంగా ఎవరినీ నియంత్రించేది కాదని, కానీ ప్రజలు స్వయంగా సహకరిస్తే మాత్రమే ఇది సాధ్యమని వారు చెబుతున్నారు. రోజుకు రెండు గంటలపాటు మాత్రమే స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తే మిగిలిన సమయాన్ని విద్యలో, కుటుంబంతో సమయం గడపడంలో, ఆటపాటలలో, ఆరోగ్యం కోసం వ్యాయామంలో వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఫోన్ లిమిట్.. వాదనలు
కానీ ఈ నియమానికి వ్యతిరేక వాదనలు కూడా వచ్చాయి. డిజిటల్ యుగంలో ప్రతి చిన్న పెద్ద పని ఫోన్ ద్వారానే జరుగుతోంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, బస్ లేదా రైలు టికెట్లు, ఉద్యోగ సంబంధ పనులు, ఆన్‌లైన్ క్లాసులు అన్నీ మొబైల్‌పైనే ఆధారపడి ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక పట్టణం మొత్తానికి రోజుకు రెండు గంటల పరిమితి పెట్టడం సాధ్యమేనా? అనేది చాలా మందికి సందేహంగా ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై పదేపదే హెచ్చరికలు చేస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే మానసిక సమస్యలు వస్తాయని, కంటి శక్తి తగ్గిపోవచ్చని, సమాజంతో సంబంధాలు దూరమవుతాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో టయోకే పట్టణం తీసుకున్న నిర్ణయం సరైనదే అని, కనీసం ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం మాత్రం అవుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
దేశాలకు మోడల్‌గా టయోకే
ఈ ప్రతిపాదన అమలైతే టయోకే ఇతర దేశాలకు కూడా ఒక మోడల్‌గా నిలవవచ్చు. స్మార్ట్ ఫోన్ అవసరం అనివార్యమని అందరూ ఒప్పుకుంటున్నా, దానికి బానిసైపోవడం మాత్రం మన భవిష్యత్తుకే ప్రమాదమని స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి టయోకే పట్టణం ప్రారంభించిన ఈ స్మార్ట్ ఫోన్ పరిమితి చర్చ ఇప్పుడు మొదలైంది. ఇది నిజంగా ఆచరణలోకి వస్తుందా? లేక విమర్శలతోనే ఆగిపోతుందా? అనేది చూడాలి.