ఒంగోలులో టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్య సంచలనంగా మారింది. ఆయన సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన నాయకుడు. మాజీ ఎంపీపీ, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. నియోజకవర్గంలో టీడీపీకి కీలక నేతగా ఉన్న వీరయ్య చౌదరి హత్య జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
కత్తులతో దాడి..
వీరయ్య చౌదరి ఒంగోలు లోని తన ఆఫీస్ లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా అక్కడికి వచ్చి దాడికి తెగబడ్డారు. ఒంగోలు లోని పద్మ టవర్స్ లో ఆయన కార్యాలయం ఉంది. ముసుగులు వేసుకుని అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు నేరుగా ఆఫీస్ లోకి దూసుకెళ్లారు. కత్తులతో అత్యంత పాశవికంగా నరికి చంపారు. దాడిలో వీరయ్య తీవ్ర గాయాలపాలయ్యారు. ఆయన చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాతే వారు పారిపోయినట్టు తెలుస్తోంది. కొన ఊపిరితో ఉన్నాడనే అనుమానంతో వీరయ్యను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.
యువగళం పాదయాత్రలో లోకేష్ గారి తో ఆప్యాయంగా ముప్పవరపు వీరయ్య చౌదరి గారు 🙏🙏 pic.twitter.com/MHD9tJ3cRd
— మన ప్రకాశం (@mana_Prakasam) April 22, 2025
షాక్ లో లోకేష్..
నారా లోకేష్ తో కూడా వీరయ్య చౌదరికి సాన్నిహిత్యం ఉంది. లోకేష్ యువగళం పాదయాత్ర సంతనూతలపాడు నియోజకవర్గానికి చేరినప్పుడు వీరయ్య కూడా అందులో పాల్గొన్నారు. “సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్య వార్త నన్ను షాక్ కు గురిచేసింది. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారు. హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాం. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుంది.” అంటూ లోకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్విట్టర్లో కూడా ఆయన తన సంతాప సందేశం ఉంచారు.
సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి హత్య వార్త నన్ను షాక్ కు గురిచేసింది. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణం. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా… pic.twitter.com/0E33h4xynN
— Lokesh Nara (@naralokesh) April 22, 2025
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కూడా వీరయ్య మృతిపై స్పందించారు. ఈ హత్యోదంతాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీలో వీరయ్య ఎంతో చురుగ్గా ఉండేవారని అన్నారు చంద్రబాబు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ డిపార్ట్ మెంట్ ని ఆదేశించారు. వీరయ్య హత్య ఘటనపై స్పందించిన హోం మంత్రి అనిత.. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు.