TDP Mahanadu 2025: కడప గడపలో నేటి నుంచి మూడు రోజులపాటు టీడీపీ 43వ మహానాడు జరుగబోతోంది. పసుపు పండుగ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మహానాడును తెలుగు దేశం శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.కడప నగర శివారులోని పబ్బాపురం లే ఔట్ లో దాదాపు 140 ఎకరాలలో నేడు,రేపు, ఎల్లుండి మహానాడు నిర్వహిస్తున్నారు. మహానాడు వేదికపై 450 మంది ప్రముఖులు కూర్చునేలా మహానాడు చరిత్రలో తొలిసారిగా బహుబలి వేదికను కడప గడ్డపై సిద్దం చేశారు.
మహానాడు నిర్వహించే మూడు రోజులపాటు సీఎం చంద్రబాబు కడప నుంచే పరిపాలన సాగించనున్నారు. ఒక వైపు పసుపు పండుగ, మరో వైపు పరిపాలన బాధ్యతతో చంద్రబాబు పూర్తిగా బిజీగా గడపనున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం అధికారులు కడపలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మహానాడు మూడు రోజుల అజెండా కార్యక్రమాలను పార్టీ ప్రకటించింది. మొదటి రోజు ప్రతినిధుల నమోదుతో సమావేశం ప్రారంభం అవుతుంది. ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరం ప్రారంభిస్తారు. 10.30 గంటలకు జ్యోతి ప్రజ్వలన అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు విగ్రహానికి పుష్పాంజలి నిర్వహిస్తారు. 11.30 గంటల నుంచి 12.15 గంటల వరకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభోపన్యాసం చేస్తారు. భోజన విరామం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తొలి ఏడాదిలో ప్రభుత్వ ఘన విజయాలు, 3.30 నుంచి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 4 గంటల నుంచి ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చ ఉంటుంది. సాయంత్రం 6.30 గంటల నుంచి శాంతిభద్రతల పరిరక్షణపై చర్చ, 7 గంటల నుంచి చంద్ర విజన్ తో సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తారు.
మహానాడు 2వ రోజు బుధవారం ఉదయం 9.30 గంటల నుండి 10.20 గంటల వరకు ఎన్టీఆర్‌కి ఘన నివాళులర్పిస్తారు. 10.30 నుండి 11.30 వరకు మౌలిక సదుపాయాల అభివృద్ధి..కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు, 11.30 గంటల నుండి 12 గంటల వరకు పేదరికం లేని సమాజం పీ-4 సంకల్పం, 12.00 గంటల నుండి 12.30 గంటల వరకు సాకారమైన విజన్ 2020.. స్వర్ణాంధ్ర @ 2047 సాధన దిశగా చర్చ ఉంటుంది. భోజనం అనంతరం 2.30 గంటల నుండి 3 గంటల వరకు విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులపై చర్చ, 3 గంటల నుండి 3.30 గంటల వరకు ప్రజాపాలనపై వైసీపీ విష ప్రచారం, 4 గంటల నుండి 5 గంటల వరకు అధ్యక్షుడి ఎన్నిక – ప్రమాణం – అభినందనలపై చర్చ ఉంటుంది. 3వ రోజు…. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి. మధ్యాహ్నం 2.00 గంటల నుండి 5 గంటల వరకు బహిరంగ సభ నిర్వ హిస్తున్నారు.
Also Read: రాష్ట్ర పర్యటనకు షర్మిల శ్రీకారం.. మూడు విడతలు, చిత్తూరు నుంచి ప్రారంభం
మూడో రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. మహానాడు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. ఐదు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మహానాడుకు వచ్చే వారికి ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ నిఘా ద్వారా అత్యాధునిక టెక్నాలజీతో ట్రాఫిక్ క్లియరెన్స్ చేపడుతామన్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తామన్నారు. 13 ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తద్వారా ట్రాఫిక్ రద్దీని తెలుసుకొని ట్రాఫిక్ క్లియరెన్స్ కు మొబైల్ క్లియర్ పార్టీ, మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు ఏర్పాటు చేశామన్నారు. 15 మంది ఐ.పీ.ఎస్ అధికారులు, 30 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీ.ఎస్పీలు, 200 మంది సి.ఐలు, ఎస్.ఐలు బందోబస్తులో ఉంటారన్నారు.