YS Sharmila: ఏపీలో రాజకీయ శూన్యత కనిపిస్తోందా? కూటమితో వైసీపీ ఫైట్ చేయలేకపోతోందా? ఆ లోటును భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తోందా? ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. వచ్చే నెల 9 నుంచి పర్యటన చేయనున్నారు. దీనికి సంబంధించిన తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఏపీ వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. జూన్ 9 నుంచి మూడు విడతలుగా పర్యటన మొదలుకానుంది. తొలుత చిత్తూరు జిల్లా నుంచి పర్యటన ప్రారంభించనున్నారు ఆ పార్టీ చీఫ్. జూన్ 30న మచిలీపట్నంలో పర్యటన ముగింపు సభ జరగనుంది. దాదాపు 21 రోజులపాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ముగింపు సభకు కాంగ్రెస్ పెద్దలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఉన్నట్లుండి వైఎస్ షర్మిల పర్యటనకు శ్రీకారం చుట్టడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ఏపీలో రాజకీయ శూన్యత కనిపిస్తోంది. కూటమి సర్కార్‌ను ఎదుర్కోలేక వైసీపీ ఇబ్బందిపడుతోంది. ఆ పార్టీ నేతలు అనేక కేసుల్లో ఇరుక్కుపోయారు. ప్రభుత్వం పెడుతున్న కేసులపై క్లారిటీ ఇచ్చేందుకు సమయం కేటాయిస్తోంది ఆ పార్టీ. అంతేకానీ జనంలోకి వెళ్లలేకపోతోంది. ఏడాదిగా అదే కొనసాగుతోంది కూడా.
సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తానని జగన్ ఒకానొక దశలో చెప్పారు. ఆయనకు పర్యటనకు నేతలు ముందుకు రాకపోవడంతో వెనుకడుగు వేసినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. వైసీపీ నుంచి ఇప్పటికే చాలామంది నేతలు వలసబాట పడుతున్నారు.
ALSO READ: అన్నదాత సుఖీభవకు ఈ కార్టు లేకుంటే రూ.20 వేలు కట్
మరికొందరు సొంతపార్టీలో ఉండలేక, మరో పార్టీలోకి వెళ్లలేక సతమతమవుతున్నారు. మిగతావారు ఉన్నా కేవలం అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పి సైలెంట్ అయిపోతున్నారు. దీన్ని గమనించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ పర్యటనకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కానుండడంతో ప్రభుత్వంపై పోరాటానికి ఆమె సిద్ధమయ్యారు.
ఈనెల 21న విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల తొలగింపు వ్యవహారంలో దీక్షకు దిగారు షర్మిల. ఆమెకు కార్మికులు, స్థానిక ప్రజల నుంచి మాంచి మద్దతు లభించింది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న కొందరు రాజకీయ నేతలు, వైసీపీ కంటే కాంగ్రెస్ బెటర్ అన్న వాదన మెల్లగా వినబడుతోంది. షర్మిల ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ పర్యటన ఫలితాలు ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో పార్టీకి అనుకూలిస్తుందని అంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు.