ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇందులో జనసేన పాత్ర పరిమితంగానే కనపడుతోంది. ఆ మాటకొస్తే ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్ అయినా కూడా ఏపీ బీజేపీ నేతల్లో సందడి లేదు. అమరావతి వ్యవహారాన్ని అంతా టీడీపీ భుజానికెత్తుకుంది. ఈ కార్యక్రమం కోసం టీడీపీ అఫిషియల్ హ్యాండిల్ నుంచి విడుదలైన బ్యానర్ లో పవన్ కల్యాణ్ కి చోటు లేదని జనసైనికులు అలగడం విశేషం.
మే 2న అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ వేడుక.#ManaAmaravati#AmaravatiTheRise#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/k3HLDi4H0w
— Telugu Desam Party (@JaiTDP) April 29, 2025
మే 2వతేదీన ప్రధాని నరేంద్రమోదీ అమరావతికి వస్తున్నారు. వైసీపీ హయాంలో ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనుల్ని ఆయన పునఃప్రారంభిస్తారు. ఇప్పటికే ఆయా పనులు మొదలైనా.. మరోసారి మోదీని రప్పించి లాంఛనంగా శంకుస్థాపనలు చేయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అమరావతికి శంకుస్థాపన చేసిన మోదీతోనే.. పునర్నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టేలా చేయాలనుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.
కూటమిలో జోష్..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు చాలా కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ కూటమికి ప్రత్యేకంగా టీడీపీకి అమరావతి అతి పెద్ద టాస్క్. అది సీఎం చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ గా వారు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందుకే అమరావతి పునర్నిర్మాణాన్ని కూడా భారీగా ప్లాన్ చేశారు. సుమారు లక్ష కోట్ల రూపాయలకుపైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ మే-2న శంకుస్థాపన చేయబోతున్నారు. మోదీ సభకు దాదాపు 5 లక్షల మందిని తీసుకు రాబోతున్నారు. అదే రోజు 30వేలమందితో రోడ్ షో కూడా ప్లాన్ చేశారు.
కూటమిలో జోష్ ఉంది కానీ.. అమరావతి వ్యవహారంలో బీజేపీ, జనసేన పెద్దగా కలుగజేసుకోవడంలేదు. ఆ మాటకొస్తే ప్రధాని పర్యటన గురించి ఆ రెండు పార్టీల నుంచి ఊహించిన స్థాయిలో స్పందన లేదు. కేవలం టీడీపీ అఫిషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మాత్రమే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫీలర్లు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగా అటు మోదీ, ఇటు చంద్రబాబు ఉన్న ఒక పోస్టర్ ని టీడీపీ విడుదల చేసింది. ప్రజా రాజధాని అనే టైటిల్ పెట్టింది. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో లేదు. దీంతో జనసైనికులు నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. జనసేన అభిమానులు కొందరు ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ వైసీపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. పవన్ కి అవమానం జరిగిందని ఆ పార్టీ సైలెంట్ గా సెటైర్లు వేస్తోంది.
అమరావతి బ్రాండ్..
పునర్నిర్మాణ పనుల హడావిడి, ప్రధాని సభ, ఏర్పాట్లు, పెట్టుబడుల వ్యవహారం పక్కనపెడితే.. రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014నుంచి 2019 వరకు పనులు జరిగినా.. ఎన్నికల్లో దాని ప్రభావం కనపడలేదు. అమరావతిని జనం పట్టించుకోలేదు. ఫలితంగా 2019లో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ రాజధానిని పట్టించుకోలేదు సరికదా మూడు రాజధానులంటూ కొత్త రాగం అందుకుంది. మూడు రాజధానుల కాన్సెప్ట్ కి జనాదరణ లేదని 2024 ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. సో అమరావతి నిర్మాణ పనుల్లో ఈసారయినా చెప్పుకోదగ్గ పురోగతి కనిపిస్తే, ఎన్నికల నాటికి ఆ మార్పుని ప్రజలు చూడగలిగితే అది కూటమి ప్రభుత్వ విజయంగా మారుతుంది. అందుకే దీనిపై సీఎం చంద్రబాబు అంతగా ఫోకస్ పెట్టారు.