Janasena vs TDP : అంతా అంటున్నట్టే రాజకీయ మారుతోంది. పిఠాపురం కూటమిలో చిచ్చు మొదలైంది. నాగబాబు మంట రాజుకుంది. నియోజకవర్గంలో మొదటిరోజు నాగబాబు పర్యటన పండుగలా సాగింది. జనసేన, టీడీపీ శ్రేణులు మెగా బ్రదర్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జై జనసేన, జై టీడీపీ, జై పవన్ కల్యాణ్, జై నాగబాబు, జై వర్మ.. నినాదాలతో హోరెత్తించారు. ఫస్ట్ డే.. గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు నాగబాబు. సెకండ్ డే కూడా అంతే ఉత్సాహంతో బయటకు వచ్చారు. కానీ… ఈసారి సీన్ మారింది. రెండోరోజుకు వచ్చేసరికి ఏదో తేడా కొట్టింది. జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట.. నాగబాబు కారు ముందు టీడీపీ నిరసన.. నాగబాబు గో బ్యాక్ అంటూ నినాదాలతో పిఠాపురం మండలం కుమారపురంలో ఉద్రిక్తత తలెత్తింది.
పిఠాపురంలో కోల్డ్‌వార్?
తిట్టుకుంటాం.. కొట్టుకుంటాం.. అయినా కలిసేఉంటాం అని ఇటీవల నారా లోకేశే ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారంటే ఆ రెండు పార్టీల మధ్య సంథింగ్ సంథింగ్ అని వేరే చెప్పాల్సిన పని లేదు. ఏపీ వ్యాప్తంగా మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉన్నా.. పిఠాపురంలో మాత్రం అస్సలు సఖ్యత లేదనే అంటున్నారు. ఈమధ్య జరిగిన జయకేతనం సభలో నాగబాబు చేసిన కామెంట్స్ ఆ చిచ్చును మరింత రగిలించాయి. పిఠాపురంలో పవన్ గెలుపునకు ఆయన ఒక్కరే కారణం అంటూ పరోక్షంగా టీడీపీ నేత వర్మను టార్గెట్ చేశారని అన్నారు. జనసేనకు.. వర్మకు మధ్య ఎప్పటినుంచో కోల్డ్‌వార్ నడుస్తోంది. అది నాగబాబు వ్యాఖ్యలతో మరింత ముదిరింది. ఆ ఎఫక్ట్.. ఇదిగో ఇప్పుడు నాగబాబు గో బ్యాక్ అంటూ టీడీపీ శ్రేణులు జెండాలతో ఆయన ముందే ఆందోళనకు దిగే వరకు వచ్చింది.
పిఠాపురంలో అసలేం జరుగుతోంది?
జనసేన, టీడీపీ మధ్య కుమ్ములాటలు ఉన్నాయా? ఆధిపత్య పోరు నడుస్తోందా? వర్మ నేనే ఎమ్మెల్యే అంటున్నారా? జనసేన మాదే పెత్తనంగా ఫీల్ అవుతున్నారా? నాగబాబు ఎంట్రీతోనే అసలు ప్రాబ్లమా? లోకల్ రచ్చ అధిష్టానాలకు ఇబ్బందిగా మారిందా? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణే అయినా ఆయన స్థానికంగా ఉండరు. సో, జనసేనాని వల్ల స్పెషల్‌గా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. టీడీపీ లీడర్ వర్మ లోకల్. తన సీటును పవన్‌కు త్యాగం చేసి గెలిపించారనే సింపతి కూడా ఆయనపై ఉంది. సో.. తాను ఎమ్మెల్యే కాకపోయినా ఆ క్రెడిట్ తనకే చెందుతుందనేది ఆయన ఫీలింగ్. అందుకే సుడో ఎమ్మెల్యేగా కాస్త ఆధికారం చెలాయించాలని అనుకోవడంలోనూ తప్పేం లేదంటున్నారు ఆయన అనుచరులు. ఇక్కడ పవర్, వర్మల మధ్య ఇష్యూస్ ఏమీ లేకపోవచ్చు. గొడవంతా జనసైనికులు, తెలుగు తమ్ముళ్ల వల్లే అంటున్నారు. నాయకులు మెచ్యూర్డ్‌గానే ఉంటున్నా.. కేడర్ మాత్రం కయ్యానికి కాలు దువ్వుతున్నారని.. కూటమికి లేనిపోని ఇబ్బందులు తీసుకొస్తున్నారని అంటున్నారు.
Also Read : విడదల రజినీకి ఆ భయం పట్టుకుందా?
నాగబాబు ఎంట్రీ నచ్చట్లేదా?
అప్పటివరకూ పిఠాపురంలో సో సో గా ఉన్న రెండు పార్టీల మధ్య గొడవలు.. నాగబాబు ఎంట్రీ తర్వాత తారాస్థాయికి చేరాయని అంటున్నారు. జయకేతనంలో ఆయన అలా కెలికి ఉండకపోతే.. ఇప్పుడు నాగబాబును అడ్డుకునే వరకు పరిస్థితి రాకపోయి ఉండేదని చెబుతున్నారు. పిఠాపురంలో పవన్ గెలిచారంటే అందరి సమిష్ఠి కృషి కాదనలేనిది. అందులో టీడీపీ నేత వర్మ త్యాగం, కమిటిమెంట్ తీసేయనిది. కానీ, పవన్ సింగిల్‌గా గెలిచారంటూ క్రెడిట్ అంతా తమ్ముడికే కట్టబెట్టారు నాగబాబు. వర్మను తక్కువ చేసేలా మాట్లాడారు. ఇన్నాళ్లూ అంతర్గతంగా ఉన్న ఇష్యూ.. ఇప్పుడిలా బహిర్గతం కావడం.. తోపులాట, గో బ్యాక్ నినాదాల వరకూ వెళ్లడం.. అంతా నాగబాబు వల్లేననేది తెలుగు తమ్ముళ్లు అంటున్న మాట. ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తరఫున పిఠాపురంలో అభివృద్ధి ప్రోగ్రామ్స్ పేరుతో నాగబాబు యాక్టివ్ రోల్ ప్లే చేస్తుండటం వ్యూహాత్మకమేనని అంటున్నారు. అది పరోక్షంగా వర్మ పెత్తనానికి గండికొట్టే ప్రయత్నమని అందుకే టీడీపీ కార్యకర్తలు తిరగబడుతున్నారనే చర్చ నడుస్తోంది. చూడాలి ముందుముందు ఏం జరుగుతుందో…