మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ కోసం ఆమె ఏపీ కోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ కేసులో బెయిల్ రాకుండా, ఒకవేళ నేరం నిర్థారణ అయితే పదేళ్ల వరకు జైలుశిక్ష పడే సెక్షన్ ఒకటి చేర్చారు ఏసీబీ అధికారులు. దీంతో రజిని, ఆమె అనుచరగణం భయపడుతోంది. జైలుశిక్ష సంగతి తర్వాత ముందు బెయిల్ రాదేమో, కటకటాల వెనక్కు వెళ్లడం తప్పదేమో అని ఆందోళన చెందుతున్నారు మాజీ మంత్రి రజిని.
అసలేంటి కేసు..?
చిలకలూరిపేట ఏరియాలో ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశారనేది కేసు. మాటలతో దారికి రాకపోవడంతో విజిలెన్స్ తనిఖీల పేరుతో స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించారని కూడా అభియోగాలున్నాయి. ఈ తనిఖీల్లో పాల్గొన్న అధికారులు కూడా తప్పు ఒప్పుకున్నారు. అప్పటి మంత్రి విడదల రజిని ఆఫీస్ ఆదేశాల మేరకే తాము ఈ పని చేశామని విచారణలో చెప్పారు. అంతే కాదు, విడదల రజినీ మరిదికి సదరు స్టోన్ క్రషర్ యాజమాన్యం డబ్బులు చెల్లించారనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. దీంతో ఈ కేసు బలంగా మారింది. మొత్తంగా 2.20 కోట్లు ఈ కేసులో చేతులు మారినట్టు తెలుస్తోంది. స్టోన్ క్రషర్ యాజమాన్యం విడదల రజినికి భయపడి విడతల వారీకా 2 కోట్ల 20 లక్షలను వారికి ముట్టజెప్పింది. ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
సెక్షన్ 386
అయితే కేసు బలంగా ఉన్నా రజినికి సులభంగా బెయిల్ వచ్చేస్తుందని ఆమె అనుచరులు భావించారు. కానీ ఈ కేసులో ఏసీబీ సెక్షన్ 386ని చేర్చడం విశేషం. అంటే చంపేస్తామంటూ భయపెట్టి అక్రమంగా వసూళ్లకు పాల్పడటం. ఇక్కడ స్టోషన్ క్రషర్ యజమానిని బెదిరించి, చంపేస్తామంటూ భయపెట్టి డబ్బులు వసూలు చేశారంటూ అభియోగాలున్నాయి. ఈ సెక్షన్ చేరిస్తే ఆమెకు బెయిల్ రావడం కష్టం. దీంతో ఇప్పుడు వ్యవహారమంతా సెక్షన్ 386 చుట్టూ తిరుగుతోంది. నిన్న(శుక్రవారం) రజిని ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున వాదనలు ముగిశాయి. దీంతో ఏజీ వాదనల కోసం విచారణ ఈనెల 8కి వాయిదా వేసింది హైకోర్టు.
బెయిల్ రాకుండా..
మాజీ మంత్రి విడదల రజినీకి బెయిల్ రాకుండా అడ్డుకోవడం కోసమే సెక్షన్ 386ని చేర్చారంటూ ఆమె తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రతీకారం కోసమే ఈ కేసు నమోదు చేయించిందని కోర్టుకి తెలిపారు. నాలుగేళ్ల క్రితం సంఘటన జరిగిందని చెబుతున్నారని, ఇప్పుడెలా కేసు నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కేవలం బెయిల్ ని అడ్డుకోవడం కోసమే సెక్షన్ 386ని చేర్చారంటున్నారు. ప్రస్తుతానికి విచారణ ఈనెల 8కి వాయిదా పడింది. ఏజీ వాదనల అనంతరం కోర్టు ఎలాంటి ఉత్తర్వులిస్తుందో వేచి చూడాలి. ఏసీబీ కేసు తర్వాత విడదల రజిని గతంలో ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. మరి ఈ కేసు వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.