BigTV English

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

ఏపీలో రెండు జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నిక రణరంగంగా మారింది. రెండు చోట్లా గొడవలు, తోపులాటలు సాధారణంగా మారాయి. 30 ఏళ్ల తర్వాత బ్యాలెట్ ఉపయోగించుకునే అవకాశం వచ్చిందని సామాన్య ప్రజలు సంబరపడితే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు మాత్రం గెలుపుకోసం చొక్కాలు పట్టుకున్నారు. పోలింగ్ ముగిసినా ఆ రెండు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.


పులివెందులలో రచ్చ..
పోలింగ్ ముగిసినా పులివెందుల ఇంకా హాట్ హాట్ గానే ఉంది. మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ముందు నాలుగింటిని సమస్యాత్మకంగా పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత మొత్తం 15 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా ప్రకటించి బందోబస్తు పెంచారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వెబ్ క్యాస్టింగ్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 600మంది పోలీసులు మోహరించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి పోలింగ్ ని బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఓటు హక్కు వినియోగించుకోవట్లేదని చెప్పారు. ఉదయాన్నుంచే పులివెందులలో కర్ఫ్యూ వాతావరణం కనపడింది. మెడికల్ షాపులు తప్ప ఇతర దుకాణాలేవీ తెరుచుకోలేదు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం ప్రశాంతంగానే ఓటర్లు క్యూలైన్లలో నిలబడ్డారు. ఆ తర్వాత క్రమక్రమంగా వాతావరణం వేడెక్కింది. దొంగఓట్లు వేసేందుకు వచ్చారంటూ కొంతమందిని పోలింగ్ ఏజెంట్లు నిలదీశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు అక్కడే గొడవపడ్డారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారటూ కొంతమందిని చితగ్గొట్టారు. రెండు చోట్ల ఘర్షణలు జరిగినా కేసులు నమోదు కావడం విశేషం. కేసులు నమోదు అయ్యే స్థాయిలో గొడవలు జరగలేదని కడప డీఐజీ ప్రకటించారు.

ఒంటిమిట్టలో కొట్లాట..
ఒంటిమిట్టలోని పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి చొచ్చుకొని రావడంతో కలకలం రేగింది. టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రం లోపల ఉన్నారని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. దీంతో అక్కడ గొడవ మొదలైంది. పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. దాదాపు అరగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది.


ఒంటిమిట్ట పోలింగ్ కి సంబంధించి చిన్న కొత్తపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాకతో వాతావరణం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. మంత్రి సమక్షంలోనే కొట్టుకున్నారు. పక్క జిల్లా నుంచి ఒంటిమిట్టకు వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు.

దొంగఓట్లు..?
పులివెందులలో దొంగఓట్లు పడ్డాయని, భారీగా రిగ్గింగ్ జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. రిగ్గింగ్ కి పాల్పడేందుకు ప్రయత్నించింది వైసీపీ నేతలేనంటూ టీడీపీ అంటోంది. మెట్‌ నూతనపల్లి గ్రామస్థులు తమకు ఓటువేసే అవకాశం లేకుండా పోయిందని ఆరోపించారు. తమ ఓట్లు వేరేవాళ్లు వేసేశారని అన్నారు. ఓటరు స్లిప్పులు తీసుకుని తరిమేశారని అన్నారు. కన్నంపల్లిలో కూడా తమ ఓట్లు ఎవరో వేసేశారంటూ మహిళలు నిరసనకు దిగారు. దొంగ ఓట్లు పడ్డాయని ఆరోపించారు.

పోలింగ్ విషయంలో పోలీసులు ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా గొడవలు మాత్రం ఆగలేదు. పోలింగ్ కేంద్రంలోనే ఇరు వర్గాలు కొట్టుకోవడం సంచలనంగా మారింది. 14వతేదీ ఉప ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన ఉంటుంది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిలో విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి. ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థి ఇరగం రెడ్డిలో ఎవరు గెలుస్తారో తేలాల్సి ఉంది.

Related News

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Big Stories

×