Modified Car Viral Video: భారీ వర్షాలు కురిసినప్పుడు రోడ్డు మీద వాహనాలు నడపాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. కారు ఇంజిన్ లోని నీళ్లు పోయి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కురుస్తున్న వానలకు వాహనదారుల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా ఓ కారు ఓనర్ క్రేజీ ఆలోచన చేశాడు. రోడ్డు మీద ఎన్ని నీళ్లున్నా దూసుకెళ్లేలా కారును మోడిఫై చేశాడు. నాలుగు ఎత్తైన చక్రాలను ఏర్పాటు చేశాడు. రోడ్డు మీద మోకాలి లోతు నీళ్లు ఉన్నా, దూసుకెళ్లేలా క్రియేట్ చేశాడు. తయారు చేయడమే కాదు, రోడ్డు మీద పరుగులు పెట్టించాడు కూడా. అయితే, ఆయన సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పోలీసులు వచ్చి పట్టుకెళ్లారు. ఎందుకంటే..
రోడ్ల మీద పరుగులు తీసిన మోడిఫై కారు
దక్షిణ చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని చావోజౌలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేని వానలతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కుండపోత వర్షం మధ్య ఓ వ్యక్తి భారీ చక్రాలతో మోడిఫైడ్ చేసిన కారును వీధుల్లోకి తీసుకొచ్చాడు. వరద నీరు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దూసుకెళ్తున్న ఈ కారు అందరినీ ఆకట్టుకుంది. లోతైన నీటిలో సులభంగా నావిగేట్ చేస్తున్నట్లు కనిపించింది. దానికి పెద్ద కస్టమ్ రిమ్ లను ఏర్పాటు చేశాడు. ఈ మోడిఫై కారు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కారు వీడియోను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పుడే అసలు స్టోరీ మొదలయ్యింది.
మోడిఫై కారును పట్టుకెళ్లిన పోలీసులు
వర్షంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయాలనుకునే సదరు వ్యక్తి సంతోషం ఎంతోసేపు నిలువలేదు. ఈ వైరల్ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో చర్యలు తీసుకున్నారు. చట్టవిరుద్ధమైన మోడిఫై చేసినందుకు అతడి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కారు యజమాని మిస్టర్ షెన్ వెల్లడించారు. తాను తయారు చేసిన కారు వరదల్లో తట్టుకునేలా ఉన్నప్పటికీ, చట్ట విరుద్ధంగా మోడిఫై ఉన్నట్లు ఒప్పుకున్నారు. ఎవరైనా తమ కార్లను మోడిఫై చేసుకోవచ్చని, అయితే, ఆ మార్పులు నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు.
గతంలోనూ మిస్టర్ షెన్ పై కేసు నమోదు
వాహనాలను మోడిఫై చేయడం మిస్టర్ షెన్ కు ఇదేమీ కొత్తకాదు. గతంలో హోండా అకార్డ్ కారు ఎగ్జాస్ట్ పైపును ఫిరంగి శైలి సెటప్ గా మార్పులు చేశాడు. అప్పుడు కూడా అధికారులు ఆయపై కేసు నమోదు చేశారు. మళ్లీ ఇన్నాళ్లు మరోసారి తన కారును నీటిలో దూసుకెళ్లేలా రూపొందించాడు. ఆయన ఆవిష్కరణలు బాగున్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు మిస్టర్ షెన్ తయారు చేసిన మోడిఫై కారు వరదల వేళ భలే ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు నెటిజన్లు. ఆయన సేవలను కార్ల కంపెనీలు ఉపయోగించుకుంటే బాగుంటుందంటున్నారు.
Read Also: ఏకంగా పర్వతాలకే ఎస్కలేటర్లు.. చైనా వాళ్లు మామూలోళ్లు కాదండోయ్!