Ayodhya In AP: విశాఖపట్నం బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అక్కడి సముద్రపు అలలు, ప్రకృతి సౌందర్యాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. అయితే వైజాగ్ బీచ్ కు ఆధ్యాత్మిక శోభ కూడా రాబోతోంది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య లో వెలసిన అయోధ్య రామమందిరం నమూనా ఇక్కడ ఏర్పాటు కాబోతోంది. మరెందుకు ఆలస్యం.. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.
విశాఖపట్నం బీచ్ ఒడ్డున భక్తులకు, సందర్శకులకు ఒక వినూత్న అనుభూతిని కలిగించేందుకు అయోధ్య రామమందిర నమూనా నిర్మాణం వేగంగా సాగుతోంది. భవ్యమైన ఆలయ నమూనా పక్కనే ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఇది ఒకే చోట ఆధ్యాత్మికతతో పాటు విజ్ఞానాన్ని అందించే విధంగా ఉంటుంది.
అయోధ్యలోని బాలరాముని ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తూ ఈ నమూనా ఆలయం తీర్చిదిద్దబడుతోంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు స్వల్ప రుసుము మాత్రమే వసూలు చేయనున్నారు. ఆలయం పక్కనే ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్‌లో రామాయణానికి సంబంధించిన విగ్రహాలు, చిత్ర ప్రదర్శనలు, వాచకాలు, మోడల్స్ కూడా ఉండనున్నాయని సమాచారం. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఈ ప్రదేశం ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
వైజాగ్ బీచ్ ప్రదేశమే ప్రత్యేకం
శుభ్రమైన సముద్రతీరాలు, సూర్యోదయ సౌందర్యం, పార్కులు, ఫుడ్ స్టాల్స్ అన్నీ కలగలిపి పర్యాటకులకు ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. అలాంటిది ఇప్పుడు రామమందిర నమూనా, ఎగ్జిబిషన్ తో మరింత ఆకర్షణగా మారుతోంది. రాత్రి వేళల్లో ప్రత్యేక లైటింగ్‌తో మెరిసే ఈ ఆలయ నిర్మాణం భక్తుల హృదయాలను తాకేలా ఉంది. ఇదంతా వచ్చే వారం రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
Also Read: Venu Swamy: వేణు స్వామి మీ దుకాణం ఇక.. మళ్లీ ట్రోలర్స్ మొదలెట్టారు
సెలవులు, వీకెండ్‌లో కుటుంబాలతో సహా వచ్చే సందర్శకులకు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా, విజ్ఞాన యాత్రగా గుర్తుండిపోతుంది. మరి అయోధ్య రామమందిరం చూసేందుకు వెళ్లని భక్తులకు ఇదొక మంచి అవకాశం. మిస్ కావద్దు.. వైజాగ్ కు వెళ్లండి.. అయోధ్య రామమందిరం నమూనాను దర్శించి బాలరాముని దర్శనం పొందిన అనుభూతి పొందండి.