
Gudiwada : వంగవీటి రంగా వర్ధంతి వేళ గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల ఆంక్షల మధ్యే టీడీపీ, జనసేన నేతలు రంగా విగ్రహానికి నివాళులర్పించారు. ఏజీకే స్కూలు వద్ద ఉన్న రంగా విగ్రహానికి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు పూలమాలలు వేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో తమ పార్టీ నేతలపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరింది కొడాలి నాని మనుషులేనని ఆరోపించారు. గత 25 ఏళ్లుగా గుడివాడలో రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఇప్పుడే ఎందుకు వైసీపీ నేతలు అడ్డుకునేందుకు యత్నించారని నిలదీశారు. రంగా ఏ ఒక్క సామాజికవర్గానికో చెందిన వ్యక్తి కాదని.. అందరివాడని అన్నారు. రౌడీయిజానికి ఎదురు నిలిచి పోరాడిన వ్యక్తి రంగా అని అన్నారు. కొడాలి నాని రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. ఆయన్ను గుడివాడ నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు. పట్టణంలో రౌడీయిజాన్ని అంతం చేస్తామని రావి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతలు రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో ఉదయం నుంచి గుడివాడలో ఉత్కంఠ కొనసాగింది. టీడీపీ కార్యాలయం వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టారు. పోలీసుల ఆంక్షల నడుమే టీడీపీ నేతలు ఏజీకే స్కూలు వద్ద రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరోవైపు శరత్ టాకీస్ వద్ద వైసీపీ నేతలు రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడివాడలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణలో ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతి నిరాకరించారు.
Revanth Reddy : బీఆర్ఎస్ కార్యకర్తల్లా ఆ అధికారులు.. బదిలీ చేయాలని రేవంత్ డిమాండ్..