
Kodali Nani : వంగవీటి మోహనరంగా హత్యపై మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగా వ్యక్తి కాదు వ్యవస్థ అని అన్నారు. ఆనాడు ఆయనను హత్య చేసిన వారు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. గుడివాడలో వంగవీటి రంగా 34వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొడాలి నాని రంగా చిత్రపటానికి నివాళులర్పించారు.
తనకు రక్షణ లేదని రంగా వేడుకున్నా ఆనాడు టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని కొడాలి నాని అన్నారు. వంగవీటి రంగాను వ్యక్తులు కాదు.. వ్యవస్థ చంపిందని స్పష్టం చేశారు. రంగా చావుకు టీడీపీనే కారణమని ఆరోపించారు. రంగాను రాజకీయంగా ఎదుర్కొలేకే చంపేశారని తెలిపారు. రంగా పేరు చెప్పుకోకుండా రాజకీయం చేయలేని దుస్థితికి టీడీపీ చేరిందని మండిపడ్డారు. వంగవీటి రంగాను తొక్కేయాలని అడుగడుగునా ప్రయత్నించారని సాధ్యం కాకపోవడంతో భౌతికంగా అడ్డుతొలగించారని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రంగా హత్య కేసులో ముద్దాయిలు టీడీపీలోనే ఉన్నారని కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ హత్యలో చంద్రబాబు, టీడీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. రంగా హత్య కేసులో దేవినేని ఉమా, వెలగపూడి రామకృష్ణ ముద్దాయిలని పేర్కొన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు రాధాను కలిస్తే చంద్రబాబు క్లాస్ పీకారని తెలిపారు. ఇప్పుడు అదే టీడీపీ రాధా కోసం పాకులాడుతోందని మండిపడ్డారు. వంగవీటి రంగా కుటుంబంతో తనకు అనుంబంధం ఉందని కొడాలి నాని వివరించారు.
గుడివాడలో తనను ఓడించడం కష్టమని కొడాలి నాని తేల్చిచెప్పారు. గుడివాడ ఓటర్లు తన భవిష్యత్తును నిర్దేశిస్తారని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెప్పారు. బాధ్యతతో పనిచేస్తున్నామని అందుకే గెలుస్తున్నామని అన్నారు. మళ్లీ గెలుస్తామనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు.