
Lalu Prasad Yadav: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మెడకు మరో కేసు మళ్లీ చుట్టుకుంది. గతంలో విచారణ ముగించిన ఓ అవినీతి కేసు దర్యాప్తును సీబీఐ తిరిగి ప్రారంభించింది. లాలూ యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2018లో సీబీఐ విచారణ ప్రారంభించింది. 2021లో విచారణ ముగిసింది.
లాలూపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి కేసు నమోదు కాలేదని అప్పుడు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో లాలూతోపాటు ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, కుమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ నిందితులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ సీబీఐ ఈ కేసు దర్యాప్తును ప్రారంభించాలని నిర్ణయించింది.
లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం సింగపూర్‌కు వెళ్లేందుకు కోర్టు అనుమతి పొందారు. కుమార్తె కిడ్నీ దానం చేయడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇదే సమయంలో సీబీఐ పాత కేసు దర్యాప్తు చేపట్టడం లాలూకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.
ఈ ఏడాది ఆగస్టులో బీజేపీతో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బంధం తెంచుకున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహా కూటమితో జత కట్టారు. ఆ రెండు పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. తేజస్వికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే సీబీఐ పాత కేసు దర్యాప్తు చేపట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కోణంలోనే ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి సీబీఐ ఈ కేసు దర్యాప్తు ఎలా ముందుకు తీసుకెళుతోందో చూడాలి. లాలూ కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు విచారిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలపై సీబీఐ, ఈడీ, ఐటీని కేంద్రం ప్రయోగిస్తుందనే విమర్శలు వస్తున్న సమయంలో లాలూపై పాత కేసు విచారణ మళ్లీ ప్రారంభించడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
Byri Naresh : ఎవరీ బైరి నరేష్?.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు హాట్ టాపిక్ అయ్యారు..?