Tirupati Railway Station: తిరుమల ఒక పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ, విదేశాల నుండి భక్తులు తరలి వస్తుంటారు. కొందరు బస్సులలో, కార్లలో, రైళ్లలో తిరుపతికి చేరుకొని తిరుమలకు ప్రయాణం సాగిస్తారు. కానీ అధికంగా ఇండియన్ రైల్వే ఏర్పాటు చేసిన రైళ్ల ద్వారానే భక్తులు తిరుపతికి వస్తుంటారు. ఇక్కడి నుండి ఇతర వాహనాల ద్వారా తిరుమలకు చేరుకుంటారు. దీనితో తిరుపతి రైల్వే స్టేషన్ నిత్యం ప్రయాణీకుల రద్దీతో మనకు కనిపిస్తుంది. ఈ రైల్వేస్టేషన్ లో కేవలం రూ. 50 లతో అదిరిపోయే అవకాశం ఉంది. ఔను, మీరు విన్నది నిజమే.. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఈ అవకాశం వరమని చెప్పవచ్చు. ఇంతకు రూ. 50 ఏంటి? ఆ సదుపాయం ఏంటో తెలుసుకుందాం.
అసలు విషయం ఏమిటంటే..
తిరుపతికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చే నేపథ్యంలో, ప్రయాణికులకు విశ్రాంతి, సౌకర్యం కలిగించే దిశగా ఇండియన్ రైల్వే ఒక వినూత్న పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 50కు మీరు ఎయిర్ కండిషన్డ్ లైఫ్‌ను ఆస్వాదించవచ్చు. అదే తిరుపతి రైల్వే స్టేషన్‌లోని అతిథి ఏసీ లాంజ్. ఇది సాధారణ లాంజ్ కాదు. ఇది ఒక చిన్న హోటల్ రూమ్ మాదిరిగానే ఉంటుంది. కానీ గంటకు కేవలం 50 రూపాయలు మాత్రమే మన వద్ద వసూలు చేస్తారు. ప్రయాణానికి ముందు లేదా అనంతరం విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికీ ఇదొక గొప్ప వరమని చెప్పవచ్చు.
లగ్జరీ అనుభవం..
అతిథి లాంజ్‌లో అడుగుపెడితే, ఏసీతో చల్లటి వాతావరణం మీకు స్వాగతం చెబుతుంది. నూతనంగా ఏర్పాటుచేసిన సోఫాలు, విశాలమైన కుర్చీలు, ఫ్రీ వైఫై, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, శుభ్రతతో నిండిన వాష్‌రూములు, ఇవన్నీ ఒక్క రూపాయికి కూడా అదనంగా ఖర్చవ్వకుండా లభిస్తాయి. ప్రతి ప్రయాణికుడు తన ట్రైన్ రావడానికి ముందు కొన్ని గంటలు వెయిట్ చేయవలసి వస్తుంది. స్టేషన్‌లో గందరగోళం మధ్య కూర్చోవడం అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాంటి వారికి ఇది ఒక మంచి సదుపాయం.
ఎలా ఉపయోగించాలి?
మీకు ఎలాంటి టికెట్ ఉన్నా, సాధారణ, ఎక్స్‌ప్రెస్, వందే భారత్ అయినా సరే, మీరు ఈ లాంజ్‌ను ఉపయోగించవచ్చు. స్టేషన్‌కి వచ్చిన తర్వాత, లాంజ్ కౌంటర్ దగ్గరికి వెళ్లి నేరుగా ఎంట్రీ టికెట్ తీసుకోవచ్చు. మీరు ఏ టికెట్ బుక్ చేసినా, ఈ లాంజ్ సదుపాయం మీద అర్హత ఉంటుంది. అంతేకాదు, మీరు ముందుగానే IRCTC వెబ్‌సైట్ https://www.rr.irctctourism.com/ ద్వారా ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు.
భక్తులకు చక్కని అవకాశం..
తిరుపతికి వచ్చినవారిలో చాలా మంది తిరుమల కొండలపైకి వెళ్లే ముందు స్టేషన్‌లో కొంత సమయం గడపాల్సి వస్తుంది. అలాంటి సమయంలో పిల్లలతో ఉన్న కుటుంబాలకు లేదా వృద్ధులకు విశ్రాంతి తీసుకోవడానికి ఇది మంచి ఛాన్స్. ముఖ్యంగా వేసవి కాలంలో ఏసీ అవసరం ఎంతటి ముఖ్యమో చెప్పక్కర్లేదు. అలాగే తిరుమల నుంచి తిరుగు ప్రయాణానికి రాత్రి ట్రైన్ ఉంటే, ఎక్కడ కూర్చోవాలో తెలియక ఇబ్బంది పడే భక్తులకూ ఇది గొప్ప సదుపాయం.
కాఫీ ఖర్చుతో..
రూ. 50 అంటే ఈ రోజుల్లో మనం కాఫీ ఒకటి తాగిన ఖర్చుగా చెప్పవచ్చు. కానీ అదే డబ్బుతో మీరు ఎయిర్ కండిషన్డ్ లాంజ్‌లో గంటసేపు ప్రశాంతంగా కూర్చొని విశ్రాంతి పొందొచ్చు. రైల్వే శాఖ ఈ సేవను ప్రయాణికుల మేలుకోసమే ప్రవేశపెట్టింది. ఇది ప్రయాణాల్ని మరింత సౌకర్యవంతంగా మార్చే వినూత్న ఆలోచనగా నిలిచింది.
Also Read: Vande Bharat Trains: వందే భారత్ ట్రైన్.. తయారీ ఖర్చు ఎంత? ఎన్ని గంటల్లో రెడీ అవుతుందంటే?
భవిష్యత్‌లో ఇతర స్టేషన్లకు కూడా..
తిరుపతిలోని ఈ లాంజ్ మంచి స్పందన పొందడంతో, రైల్వే శాఖ ఇతర ముఖ్యమైన భక్తి, పర్యాటక కేంద్రాలైన స్టేషన్లలోనూ ఇలాంటి లాంజ్‌లు ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ప్రయాణం అంటే కేవలం రైలు మీద ప్రయాణించడమే కాదు, ట్రైన్‌కు ముందు, తర్వాత సౌకర్యం కూడా ముఖ్యమని గుర్తించి రైల్వే ఈ సదుపాయాన్ని కల్పించింది.
మీ చేతిలో రూ. 50లే ఉన్నాయా? ఆ డబ్బుతో ఇప్పుడు మీరు కేవలం టిఫిన్ తినడం కాదు, తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఓ క్లాస్ లైఫ్‌ను ఆస్వాదించవచ్చు. అతిథి లాంజ్ ను ఉపయోగించుకుంటే, తగిన విశ్రాంతి దొరుకుతుంది. ఇకపై తిరుపతిలో ప్రయాణం అంటే ఆలయం దర్శించడమే కాదు, స్టేషన్‌లో కూడా ఆధ్యాత్మిక చల్లదనాన్ని పొందే అవకాశం కూడా మీకు ఉంది. మరెందుకు ఆలస్యం.. తిరుమలకు పయనమయ్యారా.. ఒక్కరికి ఇక్కడ రూ. 50 చెల్లించండి.. తగిన విశ్రాంతి పొందండి.