Tirumala Alert: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన జారీ చేసింది. ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుతల కదలికల కారణంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని కోరారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు అలిపిరి నడక మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. అయితే అలిపిరి నడక మార్గంలో ఇటీవల చిరుతల సంచారాన్ని అధికారులు, భక్తులు గుర్తించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు జాగ్రత్త భక్తులకు పలు సూచనలు జారీ చేశారు.
అలిపిరి నడక మార్గాన తిరుమలకు చేరుకునే భక్తులను సమూహాలలో అనుమతించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గతంలో ఉన్న నిబంధనల మేరకు ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సాధారణంగానే భక్తులను అలిపిరి నడక మార్గాన అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సమూహాల రూపంలో భక్తులను కొండపైకి అనుమతించడం జరుగుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.
అలాగే మధ్యాహ్నం తర్వాత 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను అలిపిరి నడక మార్గాన అనుమతించడం లేదని భక్తులు గుర్తించాలన్నారు. రాత్రి 9.30 గంటలకు అలిపిరి నడక మార్గం మూసి వేయబడుతుందని, తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.