Tirumala Darshan Update: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 58165 మంది భక్తులు దర్శించుకోగా.. 20377 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.60 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇక,
తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సంహించేదేలేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల పవిత్ర క్షేత్రం. ఇది రాజకీయ వేదిక కాదు. ఎవరు రాజకీయంగా తిరుమలను వేదికగా చేసుకున్నా చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించడం జరిగిందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో వెనుకడుగు వేయకూడదనే మా పాలకమండలి తొలి సమావేశంలోనే ప్రత్యేక ఎజెండాగా ఈ విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు.